Loan APPS: కేంద్రం మరో సంచలన నిర్ణయం.. 87 లోన్ యాప్స్ బ్యాన్.. లోక్‌సభలో ప్రకటన

లోన్ యాప్స్‌పై కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. అక్రమాలకు పాల్పడుతున్న 87 లోన్ యాప్స్ ఇండియాలో బంద్ అయ్యాయి. ఈ మేరకు వాటిని కేంద్రం బ్యాన్ చేసింది. ఈ విషయాన్ని పార్లమెంట్‌లో ప్రకటించారు. బలవంతపు వసూళ్లకు ఈ యాప్స్ పాల్పడుతున్నట్లు గుర్తించి బ్యాన్ చేశారు.

Loan APPS: కేంద్రం మరో సంచలన నిర్ణయం..  87 లోన్ యాప్స్ బ్యాన్..  లోక్‌సభలో ప్రకటన
Personal Loan Apps

Updated on: Dec 04, 2025 | 10:40 AM

కరోనా తర్వాత సామాన్య, మధ్యతరగతి ప్రజల ఆర్ధిక పరిస్థితి మరింత దిగజారింది. లక్షల మంది ఉద్యోగులు కోల్పోవడం, ఉపాధి తగ్గిపోవడంతో కుటుంబ పోషణ కష్టమవుతుంది. ఇందుకోసం అప్పులు చేయాల్సి వస్తోంది. బయట అప్పులు దొరకడం కష్టం కావడంతో సామాన్యులు ఆన్‌లైన్ లోన్ యాప్స్‌ను ఆశ్రయిస్తున్నారు. వీటిల్లో అధిక వడ్డీ, సర్వీస్ ఛార్జీల రూపంలో వేలకు వేలు వసూలు చేస్తున్నా దిక్కుతోచని పరిస్థితుల్లో డబ్బులు తీసుకుంటున్నారు. ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం లేకుండా సెకన్లలోనే డబ్బులు అకౌంట్లో పడుతుండటంతో లోన్ యాప్స్‌కు ఆదరణ పెరుగుతోంది. కానీ తిరిగి డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో రుణదాతలను లోన్ యాప్స్ నిర్వహాకులు బ్లాక్‌మెయిల్ చేయడం, వేధించడం లాంటివి చేస్తున్నారు. వీరి బాధ తట్టులేక ఆత్మహత్యలు చేసుకుంటున్నవారు కూడా ఉన్నారు.

ఈ క్రమంలో లోన్ యాప్స్ ఆగడాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 87 అక్రమ లోన్ యాప్‌లను బ్యాన్ చేసింది. డేటా దుర్వినియోగంతో పాటు మోసం, వేధింపులకు పాల్పడుతున్నారనే కారణంతో వాటిపై నిషేధం విధించింది. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్పర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఐటీ చట్టంలోని 2000లోని 69A సెక్షన్ల ఆధారంగా బ్యాన్ విధించినట్లు తెలిపింది. ఈ విషయాన్ని కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా లోక‌సభలో అధికారికంగా ప్రకటించారు. బ్యాన్ చేసిన వాటిల్లో ఆర్‌బీఐ అనుమతితో నడుస్తున్న యాప్‌లు కూడా ఉన్నాయి. బలవంతంగా రుణదాతల నుంచి వసూలు చేయండం, దోపిడీకి పాల్పడటంతో ప్రజల ఆందోళనలను తొగించేందుకు అక్రమ కార్యకలాపాలకు పాల్పడే యాప్‌లను తొలగించారు.

నిరంతరం లోన్ యాప్‌లపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుందని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకుంటామని మల్హోత్రా తెలిపారు. లోన్ యాప్స్‌పై కంపెనీల చట్టం 2013 ప్రకారం విచారణ, ఖాతాల తనిఖీ, వివరణాత్మక దర్యాప్తులతో సహా చర్యలు క్రమం తప్పకుండా తీసుకుంటామని వివరించారు. కంపెనీల చట్టం, 2013 కింద ఏదైనా ఉల్లంఘంచినట్లు నిరూపితమైతే చట్టపరమైన చర్య తీసుకోబడుతుందని నొక్కి చెప్పారు.