మొబైల్ ఫోన్లలో ఎఫ్‌ఎం రేడియోను తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు మొబైల్ తయారీ సంస్థలకు కేంద్ర ఐటీ శాఖ సూచించింది. ఐటీ మంత్రిత్వ శాఖ ఇండియన్ సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ICEA), మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MAIT) లకు అత్యవసర పరిస్థితులు, విపత్తుల సమయంలో ఎఫ్ఎం రేడియో అండుబాటులో ఉండేలా చూడాలని ఓ సలహా జారీ చేసింది. ఇది పేదలకు రేడియో సేవలను అందించడంతో పాటు క్లిష్ట సమయాల్లో ప్రతీ ఒక్కరికి ఎఫ్ఎం కనెక్టివిటీ అందుబాటులో ఉండేలా చేస్తుందని కేంద్రం తెలిపింది.
ఎఫ్‌ఎం సేవలు దేశంలో డిజిటల్ వారధి నిర్మించేందుకు సహకరిస్తాయని కేంద్రం తెలిపింది. విపత్తుల సమయంలో ఎఫ్ఎం రేడియో అందించే సమాచారం వల్ల విలువైన ప్రాణాలను రక్షించవచ్చని పేర్కొంది. మొబైల్ ఫోన్‌లలో ఇన్‌బిల్ట్ ఎఫ్‌ఎం రేడియో రిసీవర్ ఫీచర్ ఉంటే దాన్ని డిసేబుల్ చేయకుండా, ఎప్పుడూ యాక్టివేట్‌లోనే ఉండేలా ఉండేలా చూడాలని, ఒక వేళ మొబైల్ ఫోన్లలో ఎఫ్ఎం రేడియో రిసీవర్ ఫంక్షన్ లేకుంటే దాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఐటీ మంత్రిత్వ శాఖ తయారీ సంస్థలకు సూచించింది.
ఇదిలా ఉంటే ఉంటే ఎఫ్ఎం రేడియోతో మొబైల్ ఫోన్లు రావడం తగ్గిపోయినట్లు గమనించిన ఐటీ మంత్రిత్వ శాఖ, ఇది ఎఫ్ఎం సేవలపై ఆధారపడే పేదలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోందని తెలిపింది. విపత్తులు, క్లిష్ట సమయాల్లో సమాచారా మార్పిడికి ఎఫ్ఎం రేడియో ఉపయోగపడుతుందని ఐటీ మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..