దేశమంతా క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఎక్కడ చూసినా శాంటా సందడే కన్పిస్తోంది. పలువురు ప్రముఖులు దేశ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చర్చిలను అందంగా ముస్తాబు చేశారు. లైట్ల కాంతుల్లో చర్చిలు వెలిగిపోతున్నాయి. ఒడిశా లోని పూరిలో శాంటాక్లాజ్ సైకత శిల్పాన్ని అందంగా తీర్చిదిద్దారు శిల్పి సుదర్శన్ పట్నాయక్. ఉల్లిగడ్డలతో క్రిస్మస్ తాతయ్యను అందంగా అలంకరించి తన సత్తాను మరోసారి చాటుకున్నారు. పూరి బీచ్‌లో ఆనియన్ సైకతశిల్పం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుందన్నారు సుదర్శన్ పట్నాయక్ . వరల్డ్ రికార్డ్స్ ఆఫ్ ఇండియాలో ఈ సైకత శిల్పం రికార్డును సొంతం చేసుకుంది. పర్యావరణాన్ని ప్రతి ఒక్కరు కాపాడాలన్న థీమతో ఈ సైకత శిల్పాన్ని క్రిస్మస్ సందర్భంగా రూపొందిచనట్టు తెలిపారు సుదర్శన్ పట్నాయక్.
కేరళలోని అన్ని చర్చిలను అందంగా ముస్తాబు చేశారు. కొచ్చిలో కలర్‌ఫుల్ సీన్లు కన్పిస్తున్నాయి. ఏసు పుట్టిన రోజును వినూత్నరీతిన జరుపుకుంటున్నారు జనం . శ్రీనగర్ లోని ఫ్యామిలీ క్యాథలిక్ చర్చిని కూడా అందంగా అలంకరించారు. జమ్ములో కూడా చర్చిల్లో సందడే సందడి కన్పిస్తోంది. చిన్నా పెద్దా తేఉడా లేకుండా వందలాదిమంది ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటున్నారు. కోల్‌కతా లోని చర్చిల్లో భారీ రష్ కన్పిస్తోంది. వందలాదిమంది జీసస్‌ను దర్శించుకోవడానికి తరలివస్తున్నారు. లక్నో , ఢిల్లీతో పాటు దేశంలో ఎక్కడ చూసినా క్రిస్మస్ శోభ కన్పిస్తోంది. వీథులను అందంగా అలంకరించారు.
ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ముఖ్యనేతల క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తన ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ఏసు ప్రభువు జీవనం అందరికీ ఆదర్శప్రాయం అని సీఎం జగన్ స్పష్టం చేశారు. ‘దైవ కుమారుడు జీసస్ మానవునిగా జన్మించిన రోజును ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగగా జరుపుకుంటారు. ఏసుప్రభువు జీవనం అందరికీ ఆదర్శప్రాయం. తన బోధనల ద్వారా మానవాళిని సన్మార్గం వైపు నడిపించేలా మార్గనిర్దేశం చేశారు. నిస్సహాయులపై కరుణ, సాటివారిపై ప్రేమ, క్షమా, సహనం, దాతృత్వం, త్యాగం.. ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలు. ఎల్లప్పుడూ ఆ కరుణామయుని ఆశీస్సులు, దీవెనలు ప్రజలకు ఉండాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. యేసు క్రీస్తు జన్మదినాన్ని క్రైస్తవ సోదరసోదరీమణులు పండుగలా ఆనందోత్సాహాలతో జరుపుకుంటారని కేసీఆర్ అన్నారు. శాంతి సౌభ్రాతృత్వం కరుణ క్షమాగుణం నేర్పే క్రీస్తు బోధనలు సర్వమానవాళికి ఆచరణీయమని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలని ప్రార్థించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..