Arvind Kejriwal – Central government: దేశవ్యాప్తంగా కోవిడ్ -19 కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిత్యం లక్షన్నరకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ముంబై, ఢిల్లీ ప్రాంతాల్లో వేలల్లో కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల బోర్టు పరీక్షలను రద్దు చేయాలని తల్లిదండ్రులు, పలువురు నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా బోర్డు పరీక్షలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పరీక్షలను పున:పరిశీలించాలని కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దేశ రాజధానిలో ప్రస్తుతం నెలకొన్న ఆందోళనకర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ పరీక్షలను రద్దు చేయాలని కేజ్రీవాల్ కోరారు. పరీక్షలు నిర్వహించడం వల్ల వైరస్ పెద్ద ఎత్తున వ్యాప్తి చెందుతుందని తెలిపారు. దీంతోపాటు పరీక్ష కేంద్రాలు ప్రధాన హాట్‌స్పాట్‌లుగా మారవచ్చని ఆవేదన వ్యక్తంచేశారు.
ఢిల్లీలో ఆరు లక్షల మంది పిల్లలు సీబీఎస్ఈ పరీక్షలు రాయనున్నారు. దాదాపు లక్ష మంది ఉపాధ్యాయులు దీనిలో భాగం కానున్నారని కేజ్రీవాల్ తెలిపారు. ఇవి పెద్ద ఎత్తున కరోనా వ్యాప్తికి దారితీసే ప్రధాన హాట్‌స్పాట్‌లుగా మారవచ్చని.. పిల్లల జీవితాలు, అందరి ఆరోగ్యం తమకు చాలా ముఖ్యమని పేర్కొన్నారు. కావున కేంద్రం పరిశీలన చేసి పరీక్షలను రద్దు చేయాలని కోరారు. పరీక్షలకు బదులు వేరే మార్గాలను అణ్వేషించాలని కేజ్రీవాల్ సూచించారు. ఇదిలాఉంటే.. సీబీఎస్ఈ బోర్డు పరీక్షలను పున:పరిశీలించాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఆదివారం ట్వీట్ చేశారు. కరోనా సెకండ్ వేవ్ మొదలైన తరుణంలో పరీక్షలు నిర్వహించడం తగదంటూ సూచించారు.
ఇదిలాఉంటే.. అంతకుముందు కేంద్ర విద్యాశాఖ సీబీఎస్ఈ పరీక్షలు యథాతధంగా జరుగుతాయని స్పష్టంచేసింది. కోవిడ్ నిబంధనలతో పరీక్షలను నిర్వహిస్తామని.. సిలబస్‌ను పూర్తి స్థాయిలో చదవాలంటూ విద్యార్థులకు సూచించింది. అయితే సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు మే 4 జూన్ 15 మధ్య జరగనున్నాయి. మే 4 నుంచి జూన్ 7 వరకు 10 వ తరగతి పరీక్షలు, మే 4 మరియు జూన్ 15 మధ్య 12వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు.
Also Read: