Fact Check: దేశంలో ఓవైపు కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంటే.. మరోవైపు కరోనా నుంచి కోలుకున్నామనే లోపే బ్లాక్ ఫంగస్ విరుచుకుపడుతోంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా దాదాపు 10 వేల మందికిపైగా బాధితులు బ్లాక్ ఫంగస్ బారిన పడినట్లు నివేదికలు చెబుతున్నాయి. ముకార్మికోసిస్ అని కూడా పిలువబడే ఈ బ్లాక్ ఫంగస్ 50 శాతం మరణాల రేటుతో అత్యంత ప్రమాదకరమైన ఫంగల్ ఇన్ఫెక్షన్. వైద్యులు, రోగులు ఈ అరుదైన ఫంగల్ ఇన్ఫెక్షన్‌తో పోరాడుతున్నారు. ఇదిలాఉంటే.. ఇంతటి ప్రమాదకరమైన ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌ను ఇంట్లో నిత్యం ఉపయోగించే పదార్థాలతోనే చెక్ పెట్టొచ్చనే వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై సోషల్ మీడియాలోనూ తెగ రచ్చ జరుగుతోంది. పటిక, పసుపు, రాతి, ఆవ నూనె ద్వారా బ్లాక్ ఫంగస్‌ను నయం చేయవచ్చని అంతర్జాలంతో ఒక సందేశం తెగ చెక్కర్లు కొడుతోంది. ఈ సందేశం ఫేక్ అని ఫ్యాక్ట్ చెక్ దర్యాప్తులో తేలింది.
పొటాష్ ఆలుమ్, పసుపు, రాక్ సాల్ట్ పొడిలో రెండు చుక్కల ఆవ నూనెను కలిపి క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా బ్లాక్ ఫంగస్‌ను ఎలా నయం చేయవచ్చో వివరిస్తూ ఒక వీడియో సర్క్యూలేట్ అవుతోంది. అయితే, ఈ పద్ధతికి శాస్త్రీయత లేదని, దీనికి ఎవరూ అనుసరించవద్దని, ప్రమాదాన్ని కొనితెచ్చుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అసలు బ్లాక్ ఫంగస్ సోకడానికి కారణమేంటి?
మొక్కలు, ఎరువు, నేల, పాడైపోయిన ఫలాలు, కూరగాయలలో ఈ బ్లాక్ ఫంగస్ ఉంటుంది. వీటిద్వారా సంక్రమిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అది కూడా కోవిడ్ -19 బారిన పడి కోలుకున్న వారికి ఇది ఎక్కువగా సోకుతోందని చెబుతున్నారు. కోవిడ్ అనంతరం శరీరంలో రోగనిరోధక శక్తి సన్నగిల్లడంతో బ్లాక్ ఫంగస్ సోకుతుందని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువ కాలం స్టెరాయిడ్లు తీసుకున్న, ఎక్కువ కాలం ఆస్పత్రిలో చికిత్స పొందిన, ఆక్సీజన్ థెరపీ పొందిన, వెంటిలేటర్‌పై చికిత్స పొందిన సమయంలో పరిశుభ్రత సరిగా లేకపోవడం వల్ల బాధితులకు బ్లాక్ ఫంగస్ ఇన్‌ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందంటున్నారు.
కాగా, బ్లాక్ ఫంగస్‌ను ఎదుర్కొనేందుకు ఇప్పటి వరకు యాంటీ ఫంగల్ డ్రగ్ అయిన యాంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్‌ను చికిత్సలో వినియోగిస్తున్నారు. ఇదే శాస్త్రీయమైనదని వైద్యులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మి బ్లాక్ ఫంగస్ పట్ల నిర్లక్ష్యం వహించొద్దని హెచ్చరిస్తున్నారు. పైగా లేని ప్రమాదాన్ని కొనితెచ్చుకోవద్దని చెబుతున్నారు. ఇదిలాఉంటే.. ఇప్పటి వరకు బ్లాక్ ఫంగస్ మాత్రమే జనాలను భయపెట్టగా ఇప్పుడు మరో రెండు ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు వెలుగు చూశాయి. వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ కేసులు దేశంలో కొత్తగా వెలుగు చూశాయి.
Also read: