తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక ఫలితం బీజేపీకి నిరాశ కలిగించినప్పటికి.. మిగిలని చోట్ల జరిగిన ఉప ఎన్నికల్లో కమలం పార్టీకి సానుకూల ఫలితాలు వచ్చాయి. దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో జరిగిన 7 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు కూడా నవంబర్ ఆరో తేదీ ఆదివారం వెలువడ్డాయి. నాలుగు స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. మిగిలిన వాటిల్లో మహారాష్ట్రలో శివసేన (ఉద్ధవ్ థాక్రే వర్గం) , తెలంగాణలో టీఆర్‌ఎస్, బిహార్‌లో రెండింటిలో ఒక స్థానాన్ని ఆర్‌జేడీ దక్కించుకున్నాయి. తెలంగాణలో మునుగోడుతో పాటు, మహారాష్ట్రలోని అంధేరీలో, బిహార్ లో మొకామా, గోపాల్‌గంజ్, ఒడిశాలోని ధామ్ నగర్, హర్యానాలోని అదమ్‌పుర్, ఉత్తరప్రదేశ్‌లోని గోలా గోక్రానాథ్ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. మునుగోడులో టీఆర్‌ఎస్ గెలవగా, అంధేరీలో శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం) అభ్యర్థులు గెలుపొందారు. బిహార్ లోని మొకామా నియోజకవర్గంలో ఆర్జేడీ అభ్యర్థి, గోపాల్ గంజ్ లో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. ఒడిశాలోని ధామ్ నగర్ శాసనసభ నియోజకవర్గంలో బీజేపీ గెలిచింది.
ఉత్తరప్రదేశ్‌లో గోలా గోక్రానాథ్‌లో బిజేపీ గెలిచింది. మహారాష్ట్రలోని అంధేరి తూర్పులో శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం)కు చెందిన రుతుజా లట్కే తన సమీప ప్రత్యర్థి స్వతంత్య్ర అభ్యర్థి రాజేష్ త్రిపాఠిపై 64,959 ఓట్ల తేడాతో గెలుపొందారు. బిహార్‌లోని గోపాల్‌గంజ్‌లో బీజేపీ అభ్యర్థి కుసుందేవి సమీప ప్రత్యర్థి ఆర్జేడీ అభ్యర్థి మోహన్ ప్రసాద్ గుప్తాపై 1794 ఓట్ల తేడాతో గెలుపొందగా.. మొకామా నియోజకవర్గంలో ఆర్జేడీ అభ్యర్థి నీలం దేవి సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సోనం దేవిపై 16,741 ఓట్ల తేడాతో గెలుపొందింది. ఉత్తరప్రదేశ్‌లోని గోల గోకరనాథ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అమన్‌గిరి సమీప ప్రత్యర్థి సమాజ్‌వాది పార్టీ అభ్యర్థి వినయ్ తివారిపై 34298 ఓట్ల తేడాతో గెలుపొందారు.
ఒడిశాలోని ధామ్‌నగర్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి సూర్యవంశీ సూరజ్ సమీప ప్రత్యర్థి బిజు జనతాదళ్ అభ్యర్థి అబంతిదాస్ పై 9,881 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. హర్యానాలోని ఆదంపూర్ అసెంబ్లీ స్థానంలో బీజేపీకి చెందిన భవ్య బిష్ణోయ్ 15,740 ఓట్ల తేడాతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జై ప్రకాశ్ పై విజయం సాధించారు. తెలంగాణలోని మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై 10,309 ఓట్ల తేడాతో గెలుపొందారు.
మరికొన్ని జాతీయ వార్తల కోసం చూడండి..