Trinamool Congress: పశ్చిమ బెంగాల్‌లో త్వరలో ఉపఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. లోక్‌సభ, శాసనసభ ఉప ఎన్నికల్లో భాగంగా బాలీవుడ్ సీనియర్ నటుడు, బీజేపీ మాజీ నేత శత్రుఘ్నుసిన్హా, గాయకుడు బాబుల్ సుప్రియోలు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నుంచి పోటీ చేయనున్నట్లు సీఎం మమతా బెనర్జీ ఆదివారం వెల్లడించారు. కేంద్ర మాజీ మంత్రి శతృఘ్న సిన్హా అసన్సోల్ లోక్‌సభ అభ్యర్థిగా టీఎంసీ నుంచి పోటీలో ఉంటారని.. ఆయనతోపాటు బాబుల్ సుప్రియో బల్లిగంజ్ శాసనసభ స్థానం నుంచి పోటీలో ఉంటారని సీఎం మమతా ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించారు. అసన్సోల్ లోక్‌సభ ఉప ఎన్నికలో మాజీ కేంద్ర మంత్రి, ప్రముఖ నటుడు శ్రీ శత్రుఘ్న సిన్హా టీఎంసీ అభ్యర్థిగా పోటీలో ఉంటారని ప్రకటించడం సంతోషంగా ఉందని TMC అధినేత్రి ట్వీట్ చేశారు. అలాగే, బల్లీగంజ్ నుంచి కేంద్ర మాజీ మంత్రి, గాయకుడు బాబుల్ సుప్రియో పోటీ చేస్తారని మమతా బెనర్జీ ట్విట్‌లో తెలిపారు.
గతేడాది టీఎంసీలో చేరిన బాబుల్ సుప్రియో..
కాగా.. 2019లో పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్ పార్లమెంటరీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలుపొందిన బాబుల్ సుప్రియో.. రాష్ట్ర ఎన్నికల అనంతరం కేంద్ర క్యాబినేట్‌లో మార్పులతో రాజీనామా చేశారు. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. దీంతో ఈ స్థానం ఖాళీగా ఉంది. దీంతోపాటు రాష్ట్ర మంత్రి సుబ్రతా ముఖర్జీ మరణం తర్వాత బల్లిగంజ్ అసెంబ్లీ స్థానం కూడా ఖాళీ అయింది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వ క్యాబినెట్ నుంచి తొలగించిన తరువాత సుప్రియో రాజకీయాలకు దూరంగా ఉంటానని లోక్‌సభకు రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఆ తర్వాత గతేడాది జూలైలో టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ, ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ సమక్షంలో టీఎంసీలో చేరారు.
కాగా.. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని బల్లిగంజ్, ఛత్తీస్‌గఢ్‌లోని ఖైరాగఢ్, బీహార్‌లోని బోచాహాన్, మహారాష్ట్రలోని కొల్హాపూర్ నార్త్‌లకు కూడా ఉప ఎన్నికలు జరగనున్నాయి. నాలుగు రాష్ట్రాల్లో ఒక లోక్‌సభ స్థానం, నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏప్రిల్ 12న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది చివర్లో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వీటిని నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 16న ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ ఐదు ఉప ఎన్నికలకు మార్చి 17న నోటిఫికేషన్ విడుదల కానుంది.
Also Read: