భారీగా కుప్పకూలుతున్న అదానీ గ్రూప్ షేర్లకుతోడు.. రెండోరోజు కూడా పార్లమెంట్‌లో విపక్షాల రగడ కొనసాగింది. దీంతో ఉభయ సభల కార్యకలాపాలు స్తంభించాయి. సభ ప్రారంభం కాగానే అదానీ గ్రూప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని పరిశోధక సంస్థ హిండెన్‌బర్గ్ ఆరోపణలపై చర్చ జరపాలని విపక్షాలు పట్టుపట్టాయి. ఇది కాస్తా పార్లమెంట్‌లో రచ్చకు దారితీసింది. గత రెండో రోజులుగా వాయిదాల పర్వం కొనసాగుతోంది. అదానీ గ్రూప్‌పై దర్యాప్తు చేపట్టాల్సిందేనని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ లేదా సీజేఐ ఆధ్వర్యంలోని కమిటీతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశాయి.
విపక్షాల డిమాండ్‌ను లోక్‌సభ స్పీకర్ నిరాకరించారు. సభ్యులు నిరాధారమైన ఆరోపణలు చేయకూడదన్నారు. మరోవైపు రాజ్యసభ ఛైర్మన్ కూడా విపక్షాల వాయిదా తీర్మానాలను తోసిపుచ్చారు. దీంతో ప్రతిపక్ష నేతలు నినాదాలు చేస్తూ సభలో గందరగోళ పరిస్థితిని సృష్టించారు. దీంతో రాజ్యసభ మధ్యాహ్నం 2.30 గంటల వరకు, లోక్‌సభ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడింది.
ఇదిలావుంటే, శుక్రవారం స్టాక్ మార్కెట్ ప్రారంభమైన తర్వాత అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా నష్టపోయాయి. గౌతమ్ అదానీ నేతృత్వంలోని గ్రూప్ ఆస్తులు గత వారం నుంచి తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం ఉదయం సెషన్‌లో బెంచ్‌మార్క్ సెన్సెక్స్ 236 పాయింట్లు పెరిగి 60,185.49 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 17 పాయింట్లు పెరిగి 17,627.80 వద్ద ఉన్నాయి. ఉదయం నుంచి ఫైనాన్షియల్ స్టాక్స్ జోరందుకున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం