Goa – British Tourist: గోవాలో దారుణం వెలుగు చూసింది. అరాంబోల్ స్వీట్ వాటర్ బీచ్‌లో బ్రిటన్ పర్యాటకురాలిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. భర్త కళ్లెదుటే.. ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన వారం రోజుల క్రితం చోటు చేసుకోగా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. కాగా ఈ కేసులో ప్రమేయం ఉన్న 32 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. కాగా, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బ్రిటన్‌కు చెందిన ఇద్దరు దంపతులు ఉత్తర గోవా జిల్లాలోని అరాంబోల్ బీచ్ పర్యటనకు వచ్చారు. ఇక్కడ స్థానిక వ్యక్తి విన్సెంట్ డిసౌజా(32)ని ఒక గైడ్‌గా నియమించుకున్నారు. అక్కడ మసాజ్ సేవలు చాలా ఫేమస్.
అయితే, మహిళా పర్యాటకురాలిపై కన్నేసిన ఆ కీచకుడు.. మసాజ్ సెంటర్ పేరుతో తీసుకెళ్లి.. తన భర్త ఎదుటే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ అఘాయిత్యంపై బాధిత బ్రిటన్ టూరిస్ట్.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విన్సెంట్ డిసౌజాను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే, జూన్ 2న ఈ ఘటన జరుగగా.. యూకేలో ఉన్న తమ కుటుంబ సభ్యులను సంప్రదించి.. భారత్‌లోని బ్రిటిష్ రాయబార కార్యాలయం నుంచి సహాయంతో తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందిన గంటలోపే.. ఇన్‌స్పెక్టర్ విక్రమ్ నాయక్ నేతృత్వంలో పేర్నెం పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు గతంలో ఓ పాఠశాలలో లైబ్రేరియన్‌గా కూడా పనిచేశాడని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.