ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మూడు రాష్ట్రాలకు భారతీయ జనతా పార్టీ పరిశీలకులను ప్రకటించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ పరిశీలకుల పేర్లను వెల్లడించింది. మూడు రాష్ట్రంలోని ఎమ్మెల్యేలతో పరిశీలకులు సమావేశం కానున్నారు. ఎమ్మెల్యేలతో చర్చించిన అనంతరం ముఖ్యమంత్రి పేరును ఖరారు చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించినా.. ఇంకా ముఖ్యమంత్రులు ఎవరనేది స్పష్టత రాలేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించారు. అనంతరం అయా రాష్ట్రాలకు పరిశీలకు పంపి, ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకోవాలని భావించారు. ఈ నేపథ్యంలో పార్టీ పరిశీలకులను నియమించింది బీజేపీ హైకమాండ్. మూడు రాష్ట్రాల సీఎంలపై డిసెంబర్ 10న తుది నిర్ణయం తీసుకుంటామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను రాజస్థాన్ పరిశీలకునిగా చేసింది బీజేపీ. వినోద్ తావ్డే, సరోజ్ పాండేలను తన అసిస్టెంట్ సర్వేయర్లుగా పంపారు. అదే సమయంలో హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, రాజ్యసభ సభ్యులు కే. లక్ష్మణ్, ఆశా లక్రాలను మధ్యప్రదేశ్‌కు పరిశీలకులుగా పంపారు. ఛత్తీస్‌గఢ్ సీఎం ఎంపిక చేసే బాధ్యతను బీజేపీ కేంద్ర మంత్రి సర్బానంద సోనేవాల్‌కు అప్పగించింది బీజేపీ అధిష్టానం. అతనికి సహాయం చేయడానికి అర్జున్ ముండాను పంపారు.
ఇదిలావుంటే మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు చెప్పకుండానే ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ క్రమంలోనే మూడు రాష్ట్రాల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల సమావేశాలను పర్యవేక్షించే బాధ్యతను పరిశీలకులకు అప్పగించింది. బీజేపీ శాసనసభ్యులు తమ నాయకులను ఎన్నుకోనున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…