దక్షిణాదికి పాకిన జ్యోతి లీలలు! ముఖ్యమంత్రి మేనల్లుడికి జ్యోతితో ఏంటి సంబంధం?

పాక్‌ నిఘా సంస్థలకు.. దేశానికి సంబంధించిన కీలక సమాచారాన్ని అందిస్తున్నారన్న ఆరోపణలతో అరెస్టయిన జ్యోతి మల్హోత్రా.. కేవలం ఉత్తరాదిలోనే కాదు, దక్షిణాదిలోనూ తన నెట్‌వర్క్‌ కలిగి ఉన్నారనే ముచ్చట లేటెస్టుగా వెలుగుచూసింది. ఆమె కేరళ పర్యటనపై ఆ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు కె.సురేంద్రన్‌ చేసిన ఆరోపణలే దీనికి బలం చేకూరుస్తోంది.

దక్షిణాదికి పాకిన జ్యోతి లీలలు! ముఖ్యమంత్రి మేనల్లుడికి జ్యోతితో ఏంటి సంబంధం?
Jyoti Malhotra Spy Case Top Intelligence Agency

Updated on: Jun 01, 2025 | 3:37 PM

యూట్యూట్‌ వీడియోల పేరిట.. సోషల్‌ మీడియాలో భారీ క్రేజ్‌ సంపాదించుకున్న జ్యోతి మల్హోత్రా.. ఆ ముసుగులో దేశద్రోహానికి పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఆమెను దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి. పాక్‌ నిఘా సంస్థలకు.. దేశానికి సంబంధించిన కీలక సమాచారాన్ని అందిస్తున్నారన్న ఆరోపణలతో అరెస్టయిన జ్యోతి మల్హోత్రా.. కేవలం ఉత్తరాదిలోనే కాదు, దక్షిణాదిలోనూ తన నెట్‌వర్క్‌ కలిగి ఉన్నారనే ముచ్చట లేటెస్టుగా వెలుగుచూసింది. ఆమె కేరళ పర్యటనపై ఆ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు కె.సురేంద్రన్‌ చేసిన ఆరోపణలే దీనికి బలం చేకూరుస్తోంది. ఈ వ్యవహారం అటు తిరిగి, ఇటు తిరిగి.. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కాంపౌండ్‌ దగ్గరకు చేరడం.. చర్చనీయాంశంగా మారింది. సీఎం పినరయి దగ్గర బంధువులకు.. జ్యోతితో సంబంధాలున్నాయనే మాట.. రాజకీయవర్గాల్లో కలకలం రేపుతోంది.

సోషల్‌ మీడియాలో కేరళ బీజేపీ నాయకుడు కె. సురేంద్రన్‌ చేసిన పోస్టు.. ఇప్పుడు సంచలనంగా మారింది. కేరళ సీఎం పినరయి విజయన్‌ మేనల్లుడు, రియాస్ నేతృత్వంలోని కేరళ పర్యాటక శాఖ పాకిస్థాన్‌ గూఢచారి జ్యోతి మల్హోత్రా కన్నూర్‌ పర్యటనకు స్పాన్సర్‌ చేసిందన్నది ఆయన పోస్టు సారాంశం. ఈ పర్యటనలో ఆమె ఎవరిని కలిసింది? ఎక్కడికి వెళ్లింది? అసలు ఆమె అజెండా ఏంటి? పాక్‌తో సంబంధాలు ఉన్న వ్యక్తికి కేరళలో రెడ్‌ కార్పెట్‌ ఎందుకు వేశారు?’ అని సురేంద్రన్‌ ఎక్స్‌ వేదికగా ప్రశ్నించడం దుమారం రేపుతోంది. సాధారణంగానే కేరళ మంచి పర్యాటక ప్రదేశం. విత్‌ పర్మిషన్‌ అక్కడ ఎవరు పర్యటించినా అభ్యంతరం లేదు. కానీ, దాదాపుగా దేశద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్న జ్యోతి మల్హోత్రా లాంటివారు.. కేరళకు ఎందుకు వెళ్లారన్నదే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. అందులోనూ, ఆమెకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి మహ్మద్‌ రియాజ్‌ స్పాన్సర్‌ చేయడం… మరింత హాట్‌ న్యూస్‌గా మారింది. ఆయన సీఎం విజయన్‌కు మేనల్లుడు కావడంతో.. వివాదం ముదిరింది. ఈ వ్యవహారంలో.. అక్కడి ప్రభుత్వంపై ప్రశ్నలు సంధిస్తోంది బీజేపీ.

జ్యోతి మల్హోత్రాపై బీజేపీ కేరళ మాజీ అధ్యక్షుడు చేసిన సంచలన ఆరోపణలు.. ఇప్పుడు దక్షిణాదిలో కొత్త ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సౌత్‌లోనూ స్పై జ్యోతి నెట్‌వర్క్‌ ఉండొచ్చన్న అనుమానాలు మొదలయ్యాయి. ఈ పాకిస్తాన్ గూఢచారికి సౌత్‌లో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నాయి నిఘా సంస్థలు. ఏకంగా సీఎం అల్లుడు, రాష్ట్ర పర్యాటక మంత్రి మహమ్మద్ రియాస్ స్వయంగా.. పర్యాటక శాఖ నిధుల నుంచే అమె టూర్‌కు స్పాన్సర్‌ చేశారనే ముచ్చట సంచలనం సృష్టిస్తోంది. దీంతో దక్షిణాదిలోనూ ఆమె నెట్‌వర్క్‌ మామూలుగా లేదన్న ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో విచారణ బృందాలు సైలెంట్‌గా కూపీలాగుతున్నట్టు తెలుస్తోంది. అదే నిజమైతే.. జ్యోతికి సంబంధించి మరిన్ని సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

తీగ లాగితే డొంక కదిలినట్టు.. ఇటీవల జ్యోతి కథలు ఒడిశాలోనూ బయటకు వచ్చాయి. అక్కడి పూరి ఆలయంతో పాటు ప్రపంచ ప్రఖ్యాత కోణార్క్ ఆలయాన్ని కూడా ఆమె సందర్శించినట్లు పూరి క్రైమ్​ బ్రాంచ్​ నిర్ధారించింది. ఒడిశాకు చెందిన యూట్యూబర్ ప్రియాంక సహబిని విచారించగా ఈ విషయం వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రియాంక- జ్యోతిని పూరి, చిలికా, కోణార్క్‌కు తీసుకెళ్లినట్టు క్రైమ్‌ బ్రాంచ్‌ అధికారులు స్పష్టం చేశారు. ఇప్పుడు వీరిద్దరూ తీసిన వీడియో ఫుటేజీపైనే దర్యాప్తు కొనసాగుతోంది. అసలు జ్యోతి-ప్రియాంక ల మధ్య సంబంధం ఏంటీ? ట్రావెల్ టికెట్లు ఎలా కొనుగోలు చేశారు? వారికి మరెవరితోనైనా సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో విచారణ జరుగుతోంది. వారిద్దరూ కలిసి తిరిగిన ప్రదేశాలన్నింటికీ.. ప్రత్యేక దర్యాప్తు బృందాలు వెళ్లినట్టు తెలుస్తోంది.

ఇప్పటికే జ్యోతి వ్యవహారంలో కీలక విషయాలు వెలుగు చూశాయి. ట్రావెల్‌ విత్‌ జో పేరిట యూట్యూబ్‌ చానెల్‌ నిర్వహిస్తున్న ఆమె.. 2023లో పాకిస్తాన్‌ పర్యటనకు వెళ్లినప్పుడు.. అక్కడి హైకమిషన్ ఉద్యోగి డానిష్‌ను పరిచయం చేసుకుంది. ఆ తర్వాత పాక్‌ గూఢచర్య సంస్థల ప్రతినిధులతోనూ ఆమె సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. భారత సైన్యం ఆపరేషన్‌ సిందూర్ చేపట్టిన సమయంలోనూ జ్యోతి.. డానిష్‌తో టచ్‌లో ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలతోనే ఆమెను అరెస్టు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. ఆమెకు ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్లు, ఉగ్ర కార్యకలాపాల్లో పాలుపంచుకున్నట్లు ఆరోపణలు రావడంతో.. ఆ దిశగానూ విచారణ జరుపుతున్నారు. ఇదే కేసులో ఇటీవల పాకిస్థాన్‌ నిఘా సంస్థ ఏజెంట్లకు భారతీయ మొబైల్‌ సిమ్‌కార్డులు సరఫరా చేస్తున్న ఖాసిం అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. పాక్‌కు గూఢచర్యం చేసిన ఆరోపణలపై ఖాసిం సోదరుడు హసిన్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. కొత్తగా దక్షిణాదిలోనూ జ్యోతి లింకులు బయటపడటంతో.. ఈ వ్యవహారంలో ఇంకెన్ని కొత్త కోణాలు బయటకు వస్తాయోనన్న ఆసక్తి ఏర్పడింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..