
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఈ రోజు (మంగళవారం) ఉదయం 10 గంటల నుంచి మొదలయ్యాయి. సాయంత్రం 5 వరకు కొత్త పార్లమెంట్ భవనంలో సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఓటింగ్ జరనుంది. ఆ తర్వాత ఇదే రోజు సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి రాత్రికి విజేతను ప్రకటిస్తారు. పార్లమెంటు ఉభయసభలకు ప్రాతినిధ్యం వహించే మొత్తం సభ్యుల సంఖ్య 788. ఇందులో ఏడు స్థానాలు ఖాళీ కావడం వల్ల ప్రస్తుతం మొత్తం ఎలక్టోర్ల సంఖ్య 781కు చేరింది. ఇందులో లోక్‌సభ నుంచి 542, రాజ్యసభ నుంచి 239 ఓట్లు ఉన్నాయి.
అయితే ఇందులో బీఆర్‌ఎస్ (4) ఓటింగ్‌లో పాల్గొనడం లేదని ఇప్పటికే ప్రకటించింది. ఇక ఏడుగురు ఎంపీలున్న బిజు జనతాదళ్ (BJD) ఈ ఎన్నికకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించింది. శిరోమణి అకాలీదళ్, జోరమ్ పీపుల్స్ మూమెంట్ (మిజోరం) వంటి పార్టీలకు ఒక్కో సభ్యులున్నారు. వీరు కూడా ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. దీంతో ఈ పోలింగ్‌లో 386 ఓట్లు దక్కించుకున్నవారు విజేతగా నిలవనున్నారు.
తమిళనాడుకు చెందిన ఎన్డీయే అభ్యర్ధి సీపీ రాధాకృష్ణన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి ఇండియా కూటమి నుంచి బరిలో ఉన్నారు. ఎన్డీఏకు లోక్‌సభలో 293, రాజ్యసభలో 129 సభ్యులు ఉన్నారు. ఉభయసభల్లో ఎన్డీఏ సంఖ్యా బలం మొత్తం 422. ఎన్డీఏకు అవసరమైన మెజారిటీ కంటే 28 ఓట్లు ఎక్కువగా ఉంది. ఏపీ నుంచి సీపీ రాధాకృష్ణన్‌కి 36 మంది ఎంపీలు మద్దతు ఇస్తున్నారు. ఈ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి రేవంత్ ఇవాళ, రేపు ఢిల్లీలోనే పర్యటించనున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నిక పర్యవేక్షణతో పాటు, కేంద్ర మంత్రులతో భేటి అయ్యే అవకాశం ఉంది. అటు ఏపీ మంత్రి లోకేష్ కూడా ఢిల్లీలోనే పర్యటించనున్నారు. ఎంపీలతో మంత్రాంగం, కేంద్రం మంత్రులతో భేటి అయ్యే అవకాశం ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.