బిహార్‌లో ఒవైసీకి షాక్..! కూటమిలో చేర్చుకోవడానికి సిద్ధంగా లేని పార్టీలు.. కారణం ఏంటంటే?
బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలు ఎంఐఎం తో పొత్తుకు నిరాకరించాయి. ఎంఐఎం ను బీజేపీ బీ టీం అంటూ ఆరోపించి, లౌకిక ఓట్ల విభజనకు కారణమవుతుందని విమర్శించాయి. ఎంఐఎం నాయకులు మాత్రం మహాకూటమి లో చేరాలని కోరుకుంటున్నారు.

బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎంఐఎం పార్టీకి గట్టి షాక్ తగిలింది. కాంగ్రెస్, ఆర్జేడీ కూటమిలో చేరేందుకు అసదుద్దీన్ ఆసక్తి చూపించారు. కానీ, కూటమిలో ఎంఐఎంని చేర్చుకునేందుకు ఆ పార్టీలో విముఖత వ్యక్తం చేశాయి. ఎంఐఎం.. బీజేపీ బీ అంటూ కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. ఆ పార్టీతో పొత్తు అస్సలు వద్దంటూ బహిరంగంగానే చెబుతోంది. ప్రస్తుతం ఈ అంశం బిహార్‌లో కొత్త రాజకీయ చర్చకు దారితీసింది. ఎంఐఎంపై కాంగ్రెస్ ఎంపీ అఖిలేష్ ప్రసాద్ సింగ్ చేసిన విమర్శలకు మద్దతు ఇస్తూ ఆర్జేడీ అధికార ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ ఒవైసీ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ పార్టీని బీజేపీ B టీంగా అభివర్ణించారు.
“ఒవైసీ పార్టీ లౌకిక ఓట్లను విభజించడానికి, తద్వారా మతతత్వ శక్తులకు ప్రయోజనం చేకూర్చడానికి నిరంతరం కృషి చేస్తోంది” అని తివారీ అన్నారు. “వారి గత చరిత్రే దానికి సాక్ష్యం. మేం హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయం, మరి ఒవైసీ బీహార్‌కు ఎందుకు వస్తున్నారు? ఆయన నిజంగా లౌకిక శక్తులకు మద్దతు ఇవ్వాలనుకుంటే, తన పార్టీ ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేయదని ప్రకటించాలి.” అని అన్నారు.
అలాగే ఎంఐఐను కూటమిలో చేర్చడంపై కాంగ్రెస్, ఆర్జేడీ రెండూ అసంతృప్తిగా ఉన్నాయని జేడీయూ నాయకుడు కేసీ త్యాగి అన్నారు. “ఒవైసీని తమ కూటమిలో చేర్చుకోవడం పట్ల కాంగ్రెస్, ఆర్జేడీలు అసౌకర్యంగా భావిస్తున్నాయి. ఇది ఓట్ల విభజనకు దారితీస్తుందని వారు అనుకుంటున్నారు. అందుకే వారు ఆయనను కలుపుకోవడానికి ఇష్టపడరు. ఎన్డీఏకు ఆయన(ఒవైసీ) అవసరం లేదు” అని త్యాగి అన్నారు. “2020 ఎన్నికల్లో ఒవైసీ సీట్లు గెలుచుకున్న తీరు చూస్తే ఆయన ఉనికి మహాకూటమి ఓట్లను చీల్చగలదని అర్థమవుతోంది. అందుకే వారు ఆయనతో పొత్తు పెట్టుకోవడం లేదు” అని ఆయన అన్నారు.
రాజ్యసభ ఎంపీ అఖిలేష్ ప్రసాద్ సింగ్ మరింత సూటిగా మాట్లాడుతూ.. “ఎంఐఎం లాంటి మతతత్వ పార్టీతో పొత్తు ఎలా ఉంటుంది? వారు ఎప్పుడూ BJPకి సహాయంగా ఉంటారు” అని అన్నారు. అసదుద్దీన్ ఒవైసీ పార్టీ కూటమిలో చేరాలని అనుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించిన కొన్ని రోజుల తర్వాత ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు రాసిన లేఖలో ఏఐఎంఐఎం బీహార్ యూనిట్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అఖ్తరుల్ ఇమాన్, లౌకిక ఓట్ల చీలికను నివారించాల్సిన అవసరాన్ని ఎత్తిచూపుతూ పార్టీని కూటమిలో చేర్చాలని కోరారు. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అనేక మంది ఎంఐఎం నాయకులు మహా కూటమిలో భాగం కావాలనే కోరికను బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్, కాంగ్రెస్ ప్రతినిధులతో చర్చలు జరుగుతున్నాయని వారు పేర్కొన్నారు. అయితే, ఈ చర్చలలో ఇప్పటివరకు ఎటువంటి స్పష్టమైన పురోగతి లేదు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




