
బీహార్‌లోని దర్భాంగాలో ఒక భయంకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడ ఆరేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడి, ఆపై అత్యంత పాశవికంగా హతమార్చారు దుండగులు.ఆ బాలిక ఇంటికి పొరుగున ఉంటున్న వికాస్ మహతో ఈ ఘాతుకానికి ఒడిగట్టి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
దర్భాంగా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పట్వా పోఖర్‌లో ఈ దారణ ఘటన జరిగింది. ఆడుకోవడానికి వెళ్ళిన ఆరేళ్ల బాలిక కనిపించకుండాపోయింది. రాత్రి అయినా ఇంటికి రాకపోయేసరికి కంగారుపడ్డ కుటుంబ సభ్యులు ఆమె కోసం ఇరుగు పొరుగు ఇళ్లలో వెతికారు. బాలిక కనిపించకపోవడంతో, కుటుంబ సభ్యులు ఆమె కోసం గ్రామంలో వెతకడం ప్రారంభించారు. చివరికి ఒకచోట వీధి కుక్కలు మొరుగుతుండడంతో కుటుంబ సభ్యులు అనుమానం వచ్చి ఆ వైపు పరిగెత్తారు. అప్పుడు ఆ బాలిక చెరువు ఒడ్డున గోడకు అవతలి వైపు రక్తంతో తడిసి నేలపై అపస్మారక స్థితిలో పడి ఉంది. ఆమె విగతజీవిగా పడి ఉండటం చూసి, కుటుంబసభ్యులు తల్లడిల్లిపోయారు.
ఆ తరువాత, స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే, యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ పోలీసు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దర్భాంగా ఎస్‌ఎస్‌పి జగన్నాథ్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. ఎఫ్‌ఎస్‌ఎల్, సైబర్ సెల్, ప్రత్యేక పోలీస్ బృందాలతో సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో, 6 – 7 సంవత్సరాల వయస్సు గల ముగ్గురు బాలికలు ఒక చెరువు దగ్గర కలిసి ఆడుకుంటున్నట్లు తేలింది. నిందితులు ఆ బాలికలలో ఒకరిని పట్టుకుని, చీకటిలోకి తీసుకెళ్లి, లైంగిక దాడి చేసి, ఆపై హత్య చేసి పారిపోయారు.
ఈ సంఘటన గురించి విచారించినప్పుడు, ఆ అమ్మాయిలు నిందితుడి గుర్తుపట్టామని చెప్పారు. పోలీసులు సిసిటివిలో అతని ముఖాన్ని చూపించిన తర్వాత, వికాస్ మహతోను నేరస్థుడిగా నిర్ధారించారు. పోలీసులు అతని ఇంటి నుండి అతన్ని అరెస్టు చేశారు. నిందితుడి దుస్తులపై రక్తపు మరకలు ఉన్నాయని, తమదైన శైలిలో విచారించడంతో నేరం అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఆరేళ్ల బాలిక మృతదేహం లభ్యమైందని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..