నితీష్ కుమార్ మళ్లీ ఎన్డీయే కూటమిలో చేరుతారా? ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన బీహార్ సీఎం..

జీ20 దేశాధినేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చిన ప్రత్యేక వింధులో నితీష్ కుమార్ పాల్గొన్నప్పటి నుంచి ఆయన ఎన్డీయేకి మళ్లీ దగ్గరవుతున్నారన్న పుకార్లు వినిపిస్తున్నాయి. కొందరు టీవీ యాంకర్లను బహిష్కరించాలని ఇండియా కూటమి తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఆయన వ్యతిరేకించారు. ఇండియా కూటమి నిర్ణయం తనకు తెలియదని, దీన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఇందులో ప్రధాన భాగస్వామి అయిన నితీష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారంరేపాయి.

నితీష్ కుమార్ మళ్లీ ఎన్డీయే కూటమిలో చేరుతారా? ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన బీహార్ సీఎం..
Bihar CM Nitish Kumar, BJP Sr Leader Sushil Modi (File Photo)

Updated on: Sep 25, 2023 | 6:40 PM

నితీష్ కుమార్ సారథ్యంలోని జనతాదళ్ (యునైటెడ్) మళ్లీ ఎన్డీయేలో చేరేందుకు మొగ్గుచూపుతోందని గత కొంతకాలంగా జాతీయ రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. జీ20 దేశాధినేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చిన ప్రత్యేక వింధులో నితీష్ కుమార్ పాల్గొన్నప్పటి నుంచి ఈ పుకార్లు వినిపిస్తున్నాయి. కొందరు టీవీ యాంకర్లను బహిష్కరించాలని ఇండియా కూటమి తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఆయన వ్యతిరేకించారు. ఇండియా కూటమి నిర్ణయం తనకు తెలియదని, దీన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఇందులో ప్రధాన భాగస్వామి అయిన నితీష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారంరేపాయి. ఈ వ్యాఖ్యలు ఆయన ఎన్డీయే కూటమి వైపు మొగ్గుచూపుతున్నారన్న పుకార్లకు మరింత బలం చేకూర్చింది. అయితే ఈ ప్రచారానికి తెరదించుతూ నితీష్ కుమార్ సోమవారంనాడు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎన్డీయే కూటమికి వెనుదిరుగుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని స్పష్టంచేశారు. అదంతా చెత్త మాటలంటూ ఈ ప్రచారంపై నితీష్ కాస్త అసహనం వ్యక్తంచేశారు.

విపక్షాలను ఏకం చేయడమే తన లక్ష్యమని నితీష్ కుమార్ స్పష్టంచేశారు. ఆ దిశగా తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. పాట్నాలో జరిగిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకల్లో పాల్గొన్న నితీష్ కుమార్.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే ఇండియా కూటమి తరఫున దేశ ప్రధాని అయ్యే అర్హతలు నితీష్ కుమార్‌కు ఉన్నాయంటూ జేడీయు నేతలు వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని పార్టీ నేతలకు సూచించినట్లు నితీష్ కుమార్ తెలిపారు.

ఎన్డీయే కూటమిలో చేరడం లేదన్న నితీష్ కుమార్..

ఎన్డీయే కూటమిలో చేరే ప్రసక్తే లేదంటూ నితీష్ కుమార్ చేసిన కామెంట్స్‌పై బీజేపీ కూడా స్పందించింది. ఎన్డీయే కూటమిలో మళ్లీ చేరుతానని నితీష్ కుమార్ ప్రాదేయపడినా.. తాము చేర్చుకునేది లేదని బీజేపీ సీనియర్ నేత సుశీల్ మోడీ స్పష్టంచేశారు. ఆయనకు తలుపు తెరిచి లేవని అన్నారు. నితీష్ కుమార్ ప్రాధేయపడినా.. నితీష్ కుమార్‌తో మళ్లీ జట్టు కట్టేది లేదని ఇప్పటికే హోం మంత్రి అమిత్ షా స్పష్టంచేశారని గుర్తుచేశారు. ‘ఆయన్ను ఎవరు తీసుకుంటారు..? ఆయన బీహార్ ప్రజల నమ్మకాన్ని కోల్పోయారు.. మునిగిపోయే వారితో కలిసారు..’ అంటూ సుశీల్ మోదీ వ్యాఖ్యలు చేశారు.

నితీష్ కుమార్ వ్యాఖ్యలపై సుశీల్ మోదీ స్సందన..

మొత్తానికి అటు నితీష్ కుమార్, ఇటు బీజేపీ సీనియర్ నేత సుశీల్ మోదీ వ్యాఖ్యలతో జేడీయు మళ్లీ ఎన్డీయే కూటమిలో చేరుతుందని పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..