
నాగరికంగా మనిషి ఎంత ఎదిగినా.. మూఢనమ్మకాలు మాత్రం మన వెంట వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా సైన్స్ వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఈ కాలంలో ఇంకా దెయ్యాలు ఉన్నాయని నమ్మేవారు చాలా మందే ఉన్నారు. ఇక దెయ్యాల పేరిట కొందరి అమాయకత్వాన్ని సొమ్ము చేసుకునే దొంగ బాబాలు చాలా మందే ఉన్నారు. ఇది పక్కన పెడితే దెయ్యం పట్టిందంటూ భావించే వారిని డాక్టర్లు మానసిక రోగులుగా పరిగణిస్తారు. వీరిని చికిత్స అందించేందుకు ప్రత్యేకంగా కోర్సును నేర్పించేందుకు ఓ ప్రముఖ యూనివర్సిటీ సిద్ధమైంది.
భూత వైద్యం కింద ఆరు నెలల పాటు గోస్ట్ స్టడీస్‌పై డాక్టర్లకు శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్ ఇవ్వనుంది వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్సిటీ(బీహెచ్‌యూ). ఈ జనవరి నుంచి ఈ కోర్సు ప్రారంభం కానుంది. వర్సిటీలో ఆయుర్వేద కోర్సును బోధిస్తోన్న అధ్యాపకులే.. ఈ గోస్ట్ స్టడీస్‌పై శిక్షణ ఇవ్వనున్నారు. దాని కోసం వర్సిటీలో ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు ఆయుర్వేద విభాగ డీన్ యామినీ భూషన్ త్రిపాఠి తెలిపారు. ప్రధానంగా సైకలాజికల్ డిజార్డర్స్‌పైన ఈ కోర్సు ఉంటుందని.. కారణాలు లేకుండా వచ్చే వ్యాధులు, మానసిక సమస్యలకు సంబంధించిన చికిత్సను ఇందులో నేర్పిస్తామని ఆమె అన్నారు, శాస్త్రం, నమ్మకాన్ని సమపాళ్లలో ఆదరించే మన దేశంలో ఇలాంటి కోర్సులు వైద్యులకు మరింతగా ఉపయోగపడతాయని త్రిపాఠి పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ఈ కోర్సును పెట్టడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి కోర్సు అవసరమని కొంతమంది చెబుతుండగా.. మరికొందరేమో మానసిక సమస్యలను పరిష్కరించేందుకు అత్యాధునిక వైద్య విధానాలు, మందులు ఉన్నప్పుడు ఇలాంటి కోర్సు ఎందుకు అంటూ ప్రశ్నిస్తున్నారు. కొందరేమో కోర్సు పేరును మార్చాలని సూచిస్తున్నారు. ఏదేమైనా ఈ కోర్సును నేర్చుకునే వారు ఎంతమందికి దెయ్యాలను విడిపిస్తారో చూడాలి.