మహారాష్ట్రలో ఉద్దవ్ సర్కార్ దిగివచ్చినట్టే(నా) ?

| Edited By: Pardhasaradhi Peri

Feb 18, 2020 | 5:43 PM

రెండు కేసుల విషయంలో మహారాష్ట్రలోని మూడు పార్టీల కూటమితో ఏర్పడిన ఉధ్ధవ్ థాక్రే ప్రభుత్వం.. భాగస్వామ్య పార్టీలతో తలెత్తిన విభేదాలను పరిష్కరించుకునే ప్రయత్నంలో పడింది. భీమా కోరేగావ్, ఎల్గార్ పరిషద్ కేసులు రెండూ వేర్వేరని, ‘భీమా కేసును’ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీకి అప్పగించే ప్రసక్తి లేదని సీఎం, శివసేన అధినేత ఉధ్ధవ్ థాక్రే మంగళవారం ప్రకటించారు. ముఖ్యంగా ఎల్గార్ పరిషద్ కేసును ఈ దర్యాప్తు సంస్థకు అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్, ఎన్సీపీ తీవ్రంగా వ్యతిరేకించిన విషయం […]

మహారాష్ట్రలో ఉద్దవ్ సర్కార్ దిగివచ్చినట్టే(నా) ?
Follow us on

రెండు కేసుల విషయంలో మహారాష్ట్రలోని మూడు పార్టీల కూటమితో ఏర్పడిన ఉధ్ధవ్ థాక్రే ప్రభుత్వం.. భాగస్వామ్య పార్టీలతో తలెత్తిన విభేదాలను పరిష్కరించుకునే ప్రయత్నంలో పడింది. భీమా కోరేగావ్, ఎల్గార్ పరిషద్ కేసులు రెండూ వేర్వేరని, ‘భీమా కేసును’ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీకి అప్పగించే ప్రసక్తి లేదని సీఎం, శివసేన అధినేత ఉధ్ధవ్ థాక్రే మంగళవారం ప్రకటించారు. ముఖ్యంగా ఎల్గార్ పరిషద్ కేసును ఈ దర్యాప్తు సంస్థకు అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్, ఎన్సీపీ తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే.

ఈ ప్రతిపాదనను ఎంతమాత్రం అంగీకరించబోమని ఎన్సీపీ  సీనియర్ నేత శరద్ పవార్ సోమవారం స్పష్టం చేశారు. దీనిపై తమ పార్టీ నేతలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని  ఆయన చెప్పారు. ఈ సరికొత్త పరిణామంతో ఖంగు తిన్న ఉధ్ధవ్ థాక్రే.. తమ కూటమిలోని భాగస్వామ్య పార్టీలతో కలిసి వెళ్లాలనే నిశ్ఛయించుకున్నట్టు  కనబడుతోంది. భీమా-కోరేగావ్ కేసు దళితులకు సంబంధించినదని, ఈ రాష్ట్రంలోని దళితులకు అన్యాయం జరగకూడదని భావించే తాను ఎన్ ఐ ఏ కి అప్పగించకూడదని నిర్ణయం తీసుకున్నానని ఉధ్ధవ్ తెలిపారు. ‘భీమా కేసును’ దర్యాప్తు చేసేందుకు సిట్ ను ఏర్పాటు చేస్తామని ఎన్సీపీ నేత, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి నవాబ్ మాలిక్ ప్రకటించారు. దీంతో తెగేదాకా లాగడమెందుకని ఉధ్ధవ్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఎల్గార్ పరిషద్ కేసును పూణే కోర్టు.. ముంబైలోని స్పెషల్ ఎన్‌ఐ‌ఏ కోర్టుకు బదలాయించింది.

సీఏఏ, ఎన్‌పీ‌ఆర్‌లకు శివసేన మద్దతు

వివాదాస్పదమైన సీఏఏ, ఎన్‌పీ‌ఆర్‌లకు శివసేన మద్దతు ఉంటుందని ఈ పార్టీ అధినేత ఉధ్ధవ్ థాక్రే ప్రకటించారు. సీఏఏ వల్ల ముప్పు లేదని ప్రకటించిన ఆయన.. రాష్ట్రంలో ఎన్‌పీ‌ఆర్‌ను అమలు చేస్తామని చెప్పారు. సీఏఏ అమలైనా ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. ఇలా ఉండగా.. ఈ చట్టాల విషయంలో శివసేనను తాము ఒప్పిస్తామని ఎన్సీపీ నేత శరద్ పవార్ వెల్లడించారు. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్‌పీ‌ఆర్‌లను తాము వ్యతిరేకిస్తున్న విషయం ఉధ్ధవ్ థాక్రేకి తెలుసునన్నారు.