Bharatiya Janata Party: బీజేపీలో అనూహ్య మార్పులు.. తెలంగాణ, ఏపీ యూనిట్ల అధ్యక్షుల మార్పు.. లక్ష్యం ఇదే!

|

Jul 04, 2023 | 8:37 PM

భారతీయ జనతా పార్టీ తాజాగా చేసిన సంస్థాగతమైన మార్పులు చేర్పులు ఆ పార్టీ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కంటే వచ్చే ఏడు జరగనున్న లోక్‌సభ ఎన్నికలే తమకు ముఖ్యమని పరోక్షంగా చాటాయి.

Bharatiya Janata Party: బీజేపీలో అనూహ్య మార్పులు.. తెలంగాణ, ఏపీ యూనిట్ల అధ్యక్షుల మార్పు.. లక్ష్యం ఇదే!
BJP
Follow us on

Bharatiya Janata Party: భారతీయ జనతా పార్టీ తాజాగా చేసిన సంస్థాగతమైన మార్పులు చేర్పులు ఆ పార్టీ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కంటే వచ్చే ఏడు జరగనున్న లోక్‌సభ ఎన్నికలే తమకు ముఖ్యమని పరోక్షంగా చాటాయి. మరో నాలుగు నెలల వ్యవధిలో ఎన్నికలు జరగనున్న తెలంగాణ, రాజస్థాన్‌ బీజేపీ యూనిట్లకు అధ్యక్షులను మార్చడం కొత్త వారికి ఎన్నికలకు సిద్దమయ్యే యంత్రాంగాన్ని సిద్దం చేసేందుకు తగిన సమయం లేకుండా చేయడం ఆయా రాష్ట్రాలలో పార్టీ విజయావకాశాలపై పెను ప్రభావం చూపక తప్పదు. ముఖ్యంగా తెలంగాణ వంటి చోట సుదీర్ఘకాలంగా పని చేస్తూ.. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో రాష్ట్రంలో బీజేపీ ఇమేజీ పెంచిన బండి సంజయ్ కుమార్‌కి వలస నేతల మాటలకు ప్రాధాన్యతనిచ్చి మార్చడం ఆత్మహత్యాసదృశంగా చెప్పుకోవాలి. ఎన్నికలకు ఎంతో సమయం లేదు. అలకల్లో మునిగి తేలుతున్న వారికి వేరే బాధ్యతలప్పగించి పార్టీని ఎన్నికలకు సిద్దం చేసే అవకాశం వున్నా కూడా బండిని తప్పించాలనే బీజేపీ అధిష్టానం నిర్ణయించడం ఆశ్చర్యపరుస్తోంది. అధ్యక్ష పదవి వద్దు మొర్రో అన్నా వినకుండా కిషన్ రెడ్డికి ఆ బాధ్యతలు కట్టబెట్టారు. ఇపుడు ఆయన మంత్రిపదవి కూడా వుంటే ఒకలా.. మంత్రి పదవి నుంచి తప్పిస్తే మరోలా వ్యవహరిస్తారన్నది అందరూ ఊహించేదే. కిషన్ రెడ్డితోపాటు చాన్నాళ్ళుగా అసంతృప్తితో వున్న ఈటల రాజేందర్‌ను అనునయించేందుకు ఆయనకో కీలక పదవి అప్పగించారు. ఎన్నికల నిర్వహణ కమిటీకి ఆయన్ను ఛైర్మెన్‌ని చేశారు. కానీ బీజేపీ లాంటి సిద్దాంతపరమైన పార్టీని ఎన్నికల దిశగా నడిపించడంలో ఏ మేరకు సక్సెస్సవుతారన్నది అనుమానమే. ఎందుకంటే బీజేపీ యంత్రాంగం దశాబ్ధాలుగా ఒకరకమైన ఎన్నికల మేనేజ్‌మెంటుకు అలవాటు పడింది. ఇపుడు ఈటల రాజేందర్ తాను దాదాపు రెండు దశాబ్ధాలుగా నెరపుతున్న ఎన్నికల మేనేజ్‌మెంటు విధానాన్ని కమలం పార్టీలో ఏ మేరకు అమలు పరుస్తారన్నది చర్చనీయాంశంగా కనిపిస్తోంది. బండి సంజయ్ కుమార్ తనదైన ఫెరోషియస్ ధోరణితో బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఎవరు కాదన్న ఆయన క్రియేట్ చేసిన జోష్ .. మరీ ముఖ్యంగా సిద్దిపేట వేదికగా క్రియేట్ డ్రామటిక్ సన్నివేశాలు దుబ్బాక ఉప ఎన్నికలో ఓట్లు పోలరైజ్ అయ్యేలా చేశాయి. ఈ అంశంతో ప్రస్తుత ఎమ్మెల్యే రఘునందన్ రావు ఏకీభవించకపోవచ్చుగాక.. కానీ సగటు బీజేపీ కార్యకర్తలు అదే ఫీలవుతూ వుంటారు. ఈటల రాజేందర్ అసంతృప్తిని చల్లార్చేలా ఆయనకు కీలక పదవి కట్టబెట్టారు. అది ఓకే.. కానీ అసంతృప్తి రగిలిపోతున్న రఘునందన్ రావు పరిస్థితి ఏంటి ? ఏ సాకు దొరికినా సొంత గూటికి వెళ్ళిపోదామని అదను కోసం చూస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిస్థితి ఏంటి ? వీరిద్దరిని బీజేపీ అధినాయకత్వం ఎలా కాపాడుకుంటుందన్నదిపుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. క్రమశిక్షణ అధికంగా వుందని చెప్పుకునే బీజేపీ నేతలిపుడు లీకైన రఘునందన్ రావు ఆడియో క్లిప్‌ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు ? మరోవైపు రాజాసింగ్‌పై వున్న సస్పెన్షన్‌ని ఎత్తేయాలన్న ఒత్తడి కూడా బీజేపీ హైకమాండ్ మీద వుంది. రాజాసింగ్ మీద సస్పెన్షన్ ఎత్తివేయకపోతే అది భాగ్యనగరంలో వున్న బీజేపీ శ్రేణులపై నెగెటివ్ ప్రభావం చూపక తప్పదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.  అయితే, అసెంబ్లీ ఎన్నికల కంటే ఆ తర్వాత జరగనున్న లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణ నాయకత్వ మార్పు జరిగినట్లు కనిపిస్తోంది. నాలుగేళ్ళుగా కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా వున్నారు. కేంద్రం ద్వారా తెలంగాణకు ఏం ప్రయోజనం కలిగిందనే ప్రశ్నలకు ఆయన ధీటుగా సమాధానం చెప్పగలరు. ఆ కోణంలో ఆయన వ్యూహరచన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సీట్ల సంఖ్య పెంపునకు కలిసి రావచ్చు.

తెలంగాణ సంగతి కాస్త పక్కన పెడితే.. రాజస్థాన్‌లోను తాజా మార్పు అక్కడ అసెంబ్లీ ఎన్నికలపై నెగెటివ్ ప్రభావమే చూపే అవకాశాలున్నాయి. ఇటు ఏపీలో అయితే కాస్త మెరుగైన నిర్ణయంగానే చూడాలి. క్లీన్ ఇమేజీతోపాటు ఎన్టీఆర్ తనయగా ప్రత్యేకత కలిగి వున్న పురంధేశ్వరికి పార్టీని వచ్చే ఎన్నికల దిశగా సమాయాత్తం చేయడానికి తగిన సమయం వుంది. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఏపీలో జమిలి ఎన్నికలు జరుగుతాయి. ఒక ప్రత్యేక చరిష్మాను కలిగి వున్న పురంధేశ్వరి నియామకం ఏపీ బీజేపీకి బూస్ట్‌గా చెప్పుకోవాలి. సోము వీర్రాజు పార్టీ సిద్దాంత పరంగా నిబద్దత కలిగిన వ్యక్తే. కానీ ఆయన వ్యవహార శైలి పార్టీ నేతలందరినీ ఒక్కతాటి మీదకి తేలేకపోయిందనే చెప్పాలి. ఎంతో కొంత కాపు సామాజిక వర్గం ఓట్లను చీల్చే సత్తా వున్న రాజకీయ దురంధరుడు కన్నా లక్ష్మీ నారాయణ లాంటి వారు పార్టీ వీడడానికి సోము వీర్రాజే కారణమన్నది జగమెరిగిన సత్యం. ఇపుడు పురంధేశ్వరి ముందు ఓ సవాలు కూడా వుంది. పార్టీలో మొదట్నించి వున్నవాళ్ళకి… ఇటీవలి సంవత్సరాలలో చేరిన వారికి మధ్య వారధిగా ఆమె వుండగలిగితేనే ఏపీలో బీజేపీకి ఎంతో కొంత సానుకూల ఫలితాలను సాధించగలదు. పురంధేశ్వరి ముందున్న మరో సవాలు ఏపీలో ఏర్పాటవుతున్నట్లు కనిపిస్తున్న అలయెన్స్. ఏపీలో బీజేపీకి జనసేన పార్టీ ఇప్పటికే మిత్రపక్షం. తాజా పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి బీజేపీ దగ్గరవుతున్న సంకేతాలున్నాయి. ఆ మధ్య ఉన్నట్లుండి ఢిల్లీ వెళ్ళిన చంద్రబాబునాయుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో భేటీ అయి వచ్చారు. ఆ భేటీ సారాంశాన్ని ఇప్పటి వరకు ఎవరూ అధికారికంగా ప్రకటించలేదు. కానీ బీజేపీ, టీడీపీలు పలు అంశాలపై పరస్పరం సంఘీభావం ప్రకటించుకోవడం మాత్రం మొదలైంది. అయితే, తోడలుళ్ళయిన పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావుకు, చంద్రబాబునాయుడుకు రాజకీయంగా అంతగా పొసగదని తెలిసిందే. ఈ సంగతెలా వున్నా పురంధేశ్వరి తన రాజకీయ ప్రస్థానంపై భర్త జోక్యం లేనట్లుగానే చాలా ఏళ్ళుగా నడచుకుంటుంది. ఇపుడు ఏపీలో టీడీపీతో బీజేపీ జతకట్టాల్సి వస్తే పురంధేశ్వరి వైఖరి ఎలా వుంటుందన్నది ఆసక్తి రేకెత్తిస్తున్నఅంశం. అయితే, పార్టీ హైకమాండ్ పొత్తులపై ఓ నిర్ణయానికి వస్తే మాత్రం రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆమె ఏమీ చేయలేరన్నది అందరికీ తెలిసిందే. ఇలాంటి సవాళ్ళ నడుమ పురంధేశ్వరి వ్యూహం ఎలా వుంటుందనేది కీలకంగా కనిపిస్తోంది.  అయితే, ఏపీ అసెంబ్లీ ఎన్నికలతోపాటే లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయి. ఆ క్రమంలో మూడు పార్టీల కలయికలో మెరుగైన స్థాయిలో ఏపీలో ఎంపీ సీట్లను సాధించగలిగే అవకాశం వుంది. ఏమీ లేని రాష్ట్రం నుంచి 2,3 ఎంపీ సీట్లు వచ్చినా అది ఉత్తరాదిన తగ్గబోయే సీట్లను ఎంతో కొంత కవర్ చేస్తుందన్నది కమలనాథుల వ్యూహంగా బోధపడుతోంది. ఇక ఏపీ, తెలంగాణ, రాజస్థాన్, జార్ఖండ్ రాష్ట్రాల బీజేపీ చీఫ్‌లను మార్చేసిన బీజేపీ హైకమాండ్ మరో ఆరు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులను రేపో మాపో నియమించే సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..