
మార్కెట్‌లోకి వచ్చేసిన భారత్ రైస్.. రాయితీ ధరకు భారత్ రైస్ అందిస్తోంది కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం.. రూ.29కే కిలో బియ్యం చొప్పున విక్రయిస్తోంది. కర్తవ్యపథ్‌లో ఈ విక్రయాలు ప్రారంభించారు కేంద్రమంత్రి పీయూష్ గోయల్. దేశంలో బియ్యం ధరలు భారీగా పెరిగాయి. ధరల కట్టడికి కేంద్ర ప్రభుత్వం తక్కువ ధరకే భారత్ బ్రాండ్ రైస్ పేరుతో బియ్యాన్ని విక్రయిస్తోంది. భారత్ రైస్ పేరిట రూ.29కే కిలో సన్న బియ్యం నాఫెడ్, NCCF ద్వారా రిటైల్ కేంద్రాల్లో అమ్ముతుంది.
అలాగే ఇ- కామర్స్ వేదికల్లోనూ భారత్ రైస్ అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్ర సర్కార్. 5 కిలోలు, 10 కిలోల బ్యాగుల్లో భారత్ బ్రాండ్ రైస్ విక్రయిస్తున్నారు. రిటైల్ మార్కెట్లో తొలి దశలో 5 లక్షల టన్నుల బియ్యాన్ని విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది..గత ఏడాదితో పోలిస్తే, బియ్యం రిటైల్ ధరలు 13.8 శాతం, హోల్‌సేల్ ధరలు 15.7 శాతం పెరిగాయి. నిత్యవసర సరుకుల ధరలు, ఆహార ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం నియంత్రించడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే సరసమైన ధరలకే బియ్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఇప్పటికే.. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు కేంద్రం భారత్ బ్రాండ్‌తో తక్కువ ధరకు పిండి, పప్పులు, ఉల్లిపాయలు, టమోటాలను విక్రయించింది. ఇందులో భారత్ గోధుమ పిండిని గత ఏడాది నవంబర్ 6న కేంద్రం స్టార్ట్ చేసింది. ఈ-కామర్స్ వేదికల్లో భారత్ బ్రాండ్ విక్రయాలకు మంచి స్పందన వస్తుండగా.. భారత్ రైస్‌కు అదే స్థాయిలో ఆదరణ దొరుకుతుందని భావిస్తోంది…భారత్ రైస్‌తో సామాన్యులకు లాభం చేకూరనుంది.
ఇటీవల కాలంల సన్న బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. సామాన్య కుటుంబాలకు అందనంతగా సన్న బియ్యం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే 26 శాతం వరకు ధరలు పెరిగాయి. కొత్త బియ్యం తినలేక, పాత బియ్యం కొనలేక వినియోగదారులు కడుపు కట్టుకుని కూర్చునే పరిస్థితి కనిపిస్తోంది. వర్షాభావ పరిస్థితుల వల్ల వరి సాగు విస్తీర్ణం చాలా వరకు తగ్గిపోయింది. దీంతో మిల్లర్లు, రిటైల్ వ్యాపారులు కలిసి కొనుగోలుదారుల జేబులను గుల్ల చేస్తున్నారు.
ప్రస్తుతం క్వింటా సన్న బియ్యం ధర రూ.6,500కు చేరింది. ఇదే అదనుగా భావించి పలువురు బ్రోకర్లు రైస్ మిల్లుల దగ్గర నుంచి కొన్న ధరకు అదనంగా కేజీకి 5 నుంచి 8 రూపాయలు బాదుతున్నారు. ఫలితంగా బహిరంగ మార్కెట్‌లో 25 కిలోల పాత బియ్యం బస్తా 15వందల రూపాయల పైమాటే. గతేడాది సన్న బియ్యం ధర క్వింటాకు రూ.3 వేల నుంచి రూ.3,500 వరకు ఉంది. అదే పాత బియ్యమైతే రూ. 4,200 వరకు ఉండేది. కానీ ఇప్పుడు రూ. 6వేల నుంచి రూ. 6వేల 500 వరకు వెళ్లింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు అందుబాటు ధరలో బియ్యం అందించాలని భావించింది. దీంతో రూ.29లకే భారత్ రైస్‌ను ప్రవేశపెట్టింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…