Bharat Bandh Today: నేడు, రేపు భారత్ బంద్.. బ్యాంకులతోపాటు ఆ సేవలపై ప్రభావం..

Bharat Bandh Today: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు సోమవారం (మార్చి 28), మంగళవారం (మార్చి 29) భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ,

Bharat Bandh Today: నేడు, రేపు భారత్ బంద్.. బ్యాంకులతోపాటు ఆ సేవలపై ప్రభావం..
Bharat Bandh
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 28, 2022 | 5:52 AM

Bharat Bandh Today: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు సోమవారం (మార్చి 28), మంగళవారం (మార్చి 29) భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, కార్మిక చట్టంలో మార్పులకు నిరసనగా కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు ( trade unions) రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చాయి. దీనిలో భాగంగా ఈ రోజు, రేపు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగనున్నాయి. సమ్మె కారణంగా దేశవ్యాప్తంగా సంఘటిత, అసంఘటిత రంగాలన్నీ ప్రభావితం కానున్నాయి. కార్మిక సంఘాల సమ్మెకు మద్దతుగా సుమారు 60 లక్షల మంది కార్మికులు పనులను బహిష్కరించనున్నట్లు రైల్వే యూనియన్ తెలిపింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మినహా అన్ని వాణిజ్య బ్యాంకులు, గ్రామీణ, సహకార బ్యాంకులు, పోస్టాఫీసులు ఈ సమ్మెలో పాల్గొననున్నాయి.

ఈ సమ్మెలో దాదాపు 20 కోట్ల మంది కార్మికులు పాల్గొననున్నట్లు ఆల్​ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అమర్​జీత్ కౌర్ తెలిపారు. పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ సమ్మె నిర్వహిస్తామన్నారు. సమ్మె నేపథ్యంలో నిత్యావసర సేవలైన రవాణా, బ్యాంకింగ్​, రైల్వే, విద్యుత్తు సేవలపై ప్రభావం పడనుంది. లాభాల్లో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కుట్రపూరితంగానే కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరిస్తోందని కార్మిక సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు, రవాణా, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, కోల్, స్టీల్, ఆయిల్, టెలికాం, పోస్టల్, ఇన్‌కమ్ ట్యాక్స్, కాపర్, వంటి రంగాలకు చెందిన కార్మిక సంఘాలు ఈ ఆందోళనలో పాల్గొననున్నాయి. రైల్వే, రక్షణ రంగాలకు చెందిన సంఘాలు కూడా ఆందోళనలు నిర్వహించనున్నాయి.

సంఘాల ఫోరంలోని ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్‌, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, టీయూసీసీ, ఎస్‌ఈడబ్ల్యూఏ, ఏఐసీసీటీయూ, ఎల్పీఎఫ్‌, యూటీయూసీ జాతీయ యూనియన్లతోపాటు రాష్ట్రాల్లోని సంఘాలు ఈ ఆందోళనల్లో పాల్గొననున్నాయి.

Also Read:

Mayawati: పుకార్లను నమ్మకండి.. రాష్ట్రపతి పదవిపై మాయావతి సంచలన వ్యాఖ్యలు..

Pak: 40 ఏళ్లుగా దోచుకుంటున్నవారిని అడ్డుకున్నాను.. అందుకే కూల్చాలని ప్రయత్నిస్తున్నారు.. ఇస్లామాబాద్‌లో సభలో పాక్ ప్రధాని..