
బెంగళూరులో రోడ్డుమీద ఉన్న గుంతల కారణంగా ఒక విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. బెంగళూరు అవుట్‌స్కర్ట్స్‌లోని బుడిగెరె క్రాస్ వద్ద సోమవారం (సెప్టెంబర్ 29) ఉదయం 8.50 గంటల సమయంలో ధనుశ్రీ (21) అనే బీకాం రెండో సంవత్సరం చదువుతున్న యువతి దుర్మరణం చెందింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నారాయణమఠం నివాసి అయిన ధనుశ్రీ స్కూటర్‌పై కాలేజీకి వెళ్తుండగా రోడ్డుపై ఉన్న గుంతను తప్పించుకునే ప్రయత్నంలో ఆమె బైక్ బ్యాలెన్స్ కోల్పోయింది. ఆ క్రమంలో ఆమె కిందపడగా వెనక వేగంగా వస్తున్న టిప్పర్ లారీ ఆమెపైకి దూసుకెళ్లింది. ఆమె అక్కడికక్కడే మృతిచెందింది.
ప్రమాదం తరువాత టిప్పర్ డ్రైవర్ వాహనాన్ని వదిలి అక్కడి నుంచి పారిపోయాడు. కెఆర్ పురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అధికారులు దర్యాప్తు కోసం సంఘటన స్థలానికి చేరుకున్నారు. ధను శ్రీ తల్లి అవలహళ్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కేసుని దర్యాప్తు చేస్తున్నారు. టిప్పర్ డ్రైవర్ కోసం గాలింపు ప్రారంభించారు.
రెండవ సంవత్సరం కామర్స్ విద్యార్థిని ధనుశ్రీని చాలా తెలివైన స్టూడెంట్ గా చెబుతున్నారు. ఆమె అకాల మరణంతో కాలేజీలో విషాదం నెలకొంది. బెంగళూరులోని పేలవమైన రోడ్డు మౌలిక సదుపాయాలు, గుంతల ప్రమాదాలు, పౌరుల నిర్లక్ష్యం గురించి మరోసారి ఆందోళనలను రేకెత్తించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ఎంత చెప్పినా నగర వీధులపై గుంతలు అలాగే ఉన్నాయని.. ప్రజల ప్రాణాలతో ఆడుకోవడం మానేసి ప్రభుత్వం వెంటనే రోడ్లపై గుంతలు పూడ్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..