AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇక బాదుడే..! ఇంటి ముందు కారు పార్క్ చేసినా రూ.25 వేలు.. కొత్త పార్కింగ్ రూల్స్ ఇవే!

Bengaluru Parking Rules 2026: బెంగళూరులో కొత్త పార్కింగ్ విధానం నగరవాసులపై అదనపు భారం మోపనుంది. ఇంటి ముందు పబ్లిక్ రోడ్డుపై కారును పార్క్ చేసేందుకు వాహనం పరిమాణాన్ని బట్టి ఏటా రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు రుసుము చెల్లించాల్సి రావచ్చు. కొత్త పార్కింగ్ రూల్స్‌లో ఇంకా ఏం ప్రతిపాదించారో తెలుసుకోండి.

ఇక బాదుడే..! ఇంటి ముందు కారు పార్క్ చేసినా రూ.25 వేలు.. కొత్త పార్కింగ్ రూల్స్ ఇవే!
Bengaluru Parking Rules 2026
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Aug 14, 2026 | 2:21 PM

Share

Bangalore parking rules: మీరు సొంత ఇంటి ముందు రోడ్డుపై కారు పార్క్ చేస్తే ఏకంగా రూ. 25 వేల వరకు రుసుము చెల్లించాల్సిన పరిస్థితి వస్తోంది. కర్ణాటక ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త నిబంధనలు నగరవాసులకు భారీ షాక్ ఇస్తున్నాయి. ఇకపై పబ్లిక్ రోడ్లను ఎవరైనా తమ సొంత జాగాలా ఉచితంగా వాడుకోవడం కుదరదు. సొంత కారు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా జేబులోంచి భారీగా డబ్బులు తీయాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ బెంగళూరు అథారిటీ పార్కింగ్ రూల్స్ 2026 ముసాయిదాను తాజాగా విడుదల చేసింది. నగరంలో రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను తగ్గించే ఉద్దేశంతో ఈ సరికొత్త విధానాన్ని తెరపైకి తెచ్చింది. ప్రధానంగా రోడ్లపై అక్రమంగా, ఇష్టారీతిన వాహనాలు నిలపడం వల్ల పాదచారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికి శాశ్వతంగా చెక్ పెట్టేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ముసాయిదాలో స్పష్టం చేశారు.

కొత్త నిబంధనల ప్రకారం కార్ల మోడల్, వాటి సైజు ఆధారంగా వార్షిక రుసుములను ఖరారు చేశారు. చిన్న సైజులో ఉండే హ్యాచ్‌బ్యాక్ కార్లకు ఏటా రూ. 15 వేలు కట్టాలి. అలాగే కాస్త పెద్దవిగా ఉండే సెడాన్ మోడల్ కార్లకు రూ. 20 వేలు చెల్లించాలి. ఇక భారీ సైజులో ఉండే ఎస్‌యూవీ వాహనాలకైతే ఏకంగా రూ. 25 వేల వరకు వార్షిక ఫీజు వసూలు చేస్తారు. డబ్బులు కట్టడానికి సిద్ధంగా ఉన్నా అందరికీ రెసిడెన్షియల్ పార్కింగ్ పర్మిట్ సులభంగా దొరకదు. మీరు ఉంటున్న నివాస భవనాలు కచ్చితంగా నగర కార్పొరేషన్ పార్కింగ్ నిబంధనలకు లోబడి నిర్మించి ఉండాలి. ఇళ్ల లోపల కనీస పార్కింగ్ సదుపాయం లేని భవనాల యజమానులకు అసలు ఈ పర్మిట్ ఇచ్చే ప్రసక్తే ఉండదని తేల్చి చెప్పారు.

భవన నిర్మాణ చట్టాలను నిక్కచ్చిగా పాటించే వారికి మాత్రమే రోడ్డుపై పార్కింగ్ అనుమతి లభిస్తుంది. సరైన అనుమతి పత్రాలు లేకుండా ఇంటి ముందు పబ్లిక్ రోడ్డుపై కారు పెడితే చట్టవిరుద్ధంగా పరిగణిస్తారు. బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు అటువంటి వాహనదారులపై అత్యంత కఠినమైన జరిమానాలు విధిస్తారు. అనుమతి కేవలం ఆయా వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్, యజమాని పేరు మీద మాత్రమే సంబంధిత అధికారులు జారీ చేస్తారు. ఏటా ఈ పర్మిట్ రెన్యువల్ చేసుకోవడం కూడా వాహనదారులకు తప్పనిసరి చేశారు.

కేవలం ఇళ్ల ముందే కాకుండా స్థానిక వాణిజ్య రోడ్లపై గంటల చొప్పున పార్కింగ్ చార్జీలు వసూలు చేసేందుకు ఈ విధానం ప్రతిపాదిస్తోంది. ఏ, బి, సి కేటగిరీల వారీగా రోడ్లను విభజించి అధికారులు రేట్లు నిర్ణయించారు. ఆయా రోడ్లలో కార్లకు గంటకు రూ. 40 నుంచి రూ. 80 వరకు విధిగా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ద్విచక్ర వాహనాలకు రోడ్డును బట్టి గంటకు రూ. 20 నుంచి రూ. 40 వరకు చార్జీలు పడతాయి.

ఎక్కువ సమయం పాటు రోడ్లపై వాహనాలను పార్క్ చేసే వారిని నిరుత్సాహపరచడమే ఈ సరికొత్త పార్కింగ్ పాలసీ ప్రధాన లక్ష్యం. ఎవరైనా రెండు గంటల కంటే ఎక్కువ సమయం పబ్లిక్ రోడ్డుపై వాహనం నిలిపితే చార్జీల భారం మరింత పెరుగుతుంది. ఈ కొత్త రూల్స్ వల్ల ప్రజలు ఆఫ్‌స్ట్రీట్ పార్కింగ్ సెంటర్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారని అధికారులు భావిస్తున్నారు. తద్వారా రోడ్లపై ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు తగినంత ఖాళీ స్థలం ఏర్పడుతుంది.

ప్రస్తుతం ఈ పార్కింగ్ ముసాయిదా నిబంధనలపై అభ్యంతరాలు, సూచనలు తెలిపేందుకు ప్రజలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన నాటి నుంచి సరిగ్గా ముప్పై రోజుల గడువు ముగిసిన తర్వాత వీటిని అధికారిగా అమలు చేయనున్నారు. ఈ విధానం బెంగళూరు నగరంలో పూర్తిగా విజయవంతమైతే భవిష్యత్తులో దేశవ్యాప్తంగా మిగతా మెట్రో నగరాలకూ పాకే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

Follow Us