Bengaluru Bandh: కొనసాగుతోన్న బెంగళూరు బంద్.. ‘మన నీరు – మన హక్కు’.. కిచ్చా సుదీప్ ట్వీట్..

కర్ణాటక, తమిళనాడు మధ్య మరోసారి కావేరీ జల వివాదం రాజుకుంటోంది. నీటి విడుదలకు అనుకూలంగా..వ్యతిరేకంగా ఇరు రాష్ట్రాలకు చెందిన రైతులు ధర్నాలు, నిరసనలు చేపడుతున్నారు. నీటి పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది. తమిళనాడుకు 5000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కావేరి బోర్డు ఆదేశించింది.

Bengaluru Bandh: కొనసాగుతోన్న బెంగళూరు బంద్.. ‘మన నీరు - మన హక్కు’.. కిచ్చా సుదీప్ ట్వీట్..
Bengaluru Bandh

Updated on: Sep 26, 2023 | 11:16 AM

కర్ణాటక, తమిళనాడు మధ్య మరోసారి కావేరీ జల వివాదం రాజుకుంటోంది. నీటి విడుదలకు అనుకూలంగా..వ్యతిరేకంగా ఇరు రాష్ట్రాలకు చెందిన రైతులు ధర్నాలు, నిరసనలు చేపడుతున్నారు. నీటి పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది. తమిళనాడుకు 5000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కావేరి బోర్డు ఆదేశించింది. దీనిపై కన్నడిగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడుకు నీరు విడుదల చేయొద్దని కర్నాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ రైతులు నిరసనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ది కావేరీ వాటర్ మేనేజ్ మెంట్ అథారిటీ ఆదేశాలకు వ్యతిరేకంగా కన్నడ అనుకూల సంస్థలు ఇవాళ బెంగళూరు బంద్‌కు పిలుపునిచ్చాయి. మరో 15 రోజుల పాటు 5,000 క్యూసెక్కుల చొప్పున నీటిని కావేరీ బేసిన్ నుంచి తమిళనాడుకు విడుదల చేయాలంటూ ఇచ్చిన ఆదేశాలపై ఇవాళ నిర్ణయం తీసుకుంటామని కర్నాటక ప్రభుత్వం ప్రకటించింది..ఈ నేపథ్యంలో కన్నడ సంఘాలు, సంస్థలు బంద్‌ను చేపట్టాయి. కర్నాటక ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. కర్నాటక వాటర్ కన్జర్వేషన్ కమిటీ ప్రెసిడెంట్ కురుబుర్ శంతకుమార్ ఆధ్వర్యంలో ఈ బంద్ జరుగుతుంది..బంద్‌కు బీజేపీ, జేడీఎస్, ఆప్ మద్దతు తెలిపాయి.

తమిళనాడుకు కావేరీ నీటి విడుదలకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా.. ఈ శుక్రవారం (సెప్టెంబరు 29న) కర్ణాటక బంద్‌కు ఇప్పటికే పిలుపునిచ్చారు. దీనికి ముందు కర్ణాటక జల సంరక్షణ కమిటీ ఈరోజు బెంగళూరు బంద్‌కు పిలపునిచ్చింది. ఈ బంద్‌కు 100కు పైగా సంస్థలు మద్దతు తెలిపాయి. ప్రతిపక్షాలన్నీ బంద్‌కు మద్దతు తెలపడంతో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బెంగళూరు బంద్‌ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.

రైతు ఆత్మహత్యాయత్నం..

కావేరీ జలాల వివాదం నేపథ్యంలో ఫ్రీడం పార్క్‌లో ఆందోళన చేస్తున్న ఓ రైతు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. రెండోసారి ఉరి వేసుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. రైతును అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.

భూమి – నీరు.. భాషా పోరాటాలలో ఎల్లప్పుడూ మీతోనే ఉంటాను.. సుదీప్

కావేరి జలాల ఆందోళన నేపథ్యంలో నటుడు కిచ్చా సుదీప్ ట్వీట్ చేశారు. కన్నడ భూమి, నీరు, భాషకు సంబంధించిన అన్ని పోరాటాల్లో నేను ఎప్పుడూ మీతో ఉంటాను. వానలు కురవక పోవడంతో ప్రజల వ్యవసాయమే కాకుండా రైతులకు తాగునీటికి కూడా తీవ్ర ఇబ్బందిగా మారింది. వర్షాకాలం తప్ప మనకు తాగునీటి వనరులు లేవు. మనం కావేరిపై ఆధారపడతాం. నాకు తెలిసినంత వరకు కరువు అధ్యయన కమిటీ- కావేరి కమిటీ సాంకేతిక నిపుణులు కర్నాటకలో ప్రస్తుత కరువు పరిస్థితుల గురించి ట్రిబ్యునల్ కోర్టును, కేంద్ర ప్రభుత్వాన్ని వెంటనే ఒప్పించాలి. తమిళనాడు ముఖ్యమంత్రులతో సామరస్యపూర్వక చర్చల ద్వారా సమస్యను తాత్కాలికంగా పరిష్కరించుకోవచ్చని మన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా గత ముఖ్యమంత్రుల మాదిరిగానే చెప్పారని విన్నాను. ప్రస్తుత కరువు-నీటి ఎద్దడిని ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాను. క‌ర్నాట‌క ప‌రిస్థితుల‌ను అర్థం చేసుకునేందుకు పార్టీల నేత‌లంద‌రూ క‌లిసి రావాల‌ని కోరుతున్నాను. త‌మిళ‌నాడు రైతుల‌కు కూడా పంట‌కు నీరందించండి, అయితే ముందుగా మ‌న తాగునీటి ఎద్దడిని తీర్చండి.. ఈ స‌మ‌స్యను వీలైనంత త్వర‌గా ప‌రిష్కరించండి. పోరాటం గెలుస్తుంది, దీనితో పాటు కృష్ణా నది – మహదాయి నది, ఉత్తర కర్ణాటకలో కలసా బండూరి వివాదాల పరిష్కారంతో ప్రజల కష్టాలు తీరుతాయని ఆశిస్తున్నాను. మన నీరు మన హక్కు అంటూ నటుడు కిచ్చా సుదీప్ ట్వీట్ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..