ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందని మీరు వినే ఉంటారు. అయితే గుజరాత్ ఎన్నికలో దేడియపాడ నియోజకవర్గం నుంచి గెలిచిన వ్యక్తి విజయం వెనుక ఇద్దరు ఆడవాళ్లు ఉన్నారు. తన ఇద్దరు భార్యల మద్ధతు తనకు ఉండడంతో ఆయన ఆ నియోజకవర్గం నుంచి గెలిచిన తొలి గిరిజన ఎమ్మెల్యేగా కూడా నిలిచాడు. గెలిచిన తర్వాత ఆయన మాట్లాడుతూ ‘‘నా భార్యలు ఒక జట్టుగా పనిచేసి నా విజయంలో నాకు ఎంతగానో సహకరించారు. నేను ప్రచారానికి దూరంగా ఉన్నప్పుడు కూడా వారు అవిశ్రాంతంగా పనిచేశారు. అనేక ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహించారు’’ అని అన్నాడు. ఆయన ఎవరంటే.. దక్షిణ గుజరాత్ గిరిజన ప్రాంతం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున గెలుపొందిన ఏకైక అభ్యర్థి చైతర్ వాసవ. దాదాపు 40,000 ఓట్ల మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టించాడు వాసవ. ఎన్నికలకు ముందు భారతీయ గిరిజన పార్టీ (BTP)నాయకుడిగా ఉన్న వాసవ.. ఎన్నికలలో ఆప్ తరఫున పోటీచేశాడు. ఆయన ప్రత్యర్థులైన బీజేపీ, కాంగ్రెస్‌ల మాదిరిగా.. ఎన్నికల ప్రచార సమయంలో వాసవ తరఫున స్టార్ క్యాంపెయినర్‌లు ఎవరూ కనిపించలేదు. ఆయన తరఫున ప్రచారం చేసినదల్లా తన ఇద్దరు భార్యలు మాత్రమే.
దేడియాపాడలోని బోగాజ్ గ్రామానికి చెందని చైతర్ వాసవ దశాబ్దం క్రితం గిరిజన సంఘం కోసం పనిచేయడం ప్రారంభించి 2014లో బీటీపీలో చేరారు. అయితే దేడియాపాడులో బీటీపీ అధినేతగా ఉన్న ఛోటు వాసవ కుమారుడు మహేశ్ కూడా చైతర్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. వాసవ తన గెలుపుపై స్పందిస్తూ.. ‘‘నాకు ప్రభుత్వ ఉద్యోగం ఉంది ఇంకా నా భార్యలు కూడా ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నారు. కానీ గిరిజనుల సంక్షేమం కోసం పని చేయడానికి నేను నా ఉద్యోగాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాను. నా భార్యలు (శకుంతల, వర్ష) కూడా తర్వాత తమ ఉద్యోగాలను వదులుకుని గత కొన్ని సంవత్సరాలుగా నా రాజకీయ ఆశయాలకు మద్దతు ఇవ్వడం ప్రారంభించారు. శకుంతల దేడియాపాడు జిల్లా పంచాయతీ చైర్మన్‌గా ఉన్నప్పుడు గిరిజన మహిళలకు మద్దతుగా ప్రదర్శనలు చేసినందుకు రెండుసార్లు జైలు శిక్ష కూడా అనుభవించారు’’ అని వాసవ తెలిపారు.
శకుంతలను 13 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్న వాసవ ఆ వెంటనే రెండేళ్ల తర్వాత వర్షను పెళ్లి చేసుకున్నాడు. ‘‘మేము ముగ్గురం కలిసి చదువుకున్నాము. శకుంతల, వర్ష చిన్నప్పటి నుంచి స్నేహితులు. మేమంతా ఒక సంతోషకరమైన కుటుంబంగా కలిసి ఉంటున్నాము. నాకు శకుంతల ద్వారా ఒక బిడ్డ, వర్షతో ఇద్దరు ఉన్నారు’’ అని వాసవ అన్నారు. ‘‘మేము ఆయన (వాసవ) గెలుపు కోసం రెండు నెలలుగా కష్టపడ్డాము. మా ప్రచార ప్రణాళికలను రూపొందించడానికి అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిర్వహించిన అనేక సమావేశాలలో నేను పాల్గొన్నాను’’ అని శకుంతల వాసవ చెప్పారు. వర్ష కూడా శకుంతల చెప్పిన మాటలనే చెప్తూ.. తన భర్తకు ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటానని తెలిపారు.