దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది ఈ జిల్లాలోనే! 10 గంటల తర్వాత అప్రకటిత కర్ఫ్యూ

బండా జిల్లా తీవ్ర ఉష్ణోగ్రతలతో అగ్నిగుండంలా మారింది. 48 డిగ్రీలకు పైగా నమోదవుతున్న వేడి కారణంగా ప్రజల జీవనం, వ్యవసాయం, వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. అడవుల నరికివేత, అక్రమ మైనింగ్‌, ఇసుక తవ్వకాల వల్ల సహజ వాతావరణ సమతౌల్యం కోల్పోయి బండా ‘హీట్ ఐలాండ్‌’గా మారుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది ఈ జిల్లాలోనే! 10 గంటల తర్వాత అప్రకటిత కర్ఫ్యూ
Banda Heatwave

Updated on: May 20, 2026 | 8:28 PM

ఉత్తరప్రదేశ్‌లోని బండా జిల్లా ఈ ఏడాది దేశంలోనే అత్యంత వేడిగల ప్రాంతాల్లో ఒకటిగా మారింది. ఉష్ణోగ్రతలు వరుసగా 48 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవడంతో ప్రజల దైనందిన జీవితం పూర్తిగా అస్తవ్యస్తమవుతోంది. ఏప్రిల్ 27న 47.6°C నమోదైన బండా, తాజాగా 48.2°Cతో దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతను నమోదు చేసి కొత్త రికార్డు సృష్టించింది. అత్తారా పట్టణానికి చెందిన ఆభరణాల వ్యాపారి లఖన్ గుప్తా ఉదయం 6 గంటలకే పనులు ప్రారంభించి, 9 గంటలకల్లా ఇంటికి చేరుకుంటున్నారు. ఉదయం 10 గంటల తర్వాత రోడ్లన్నీ ఖాళీగా మారిపోతున్నాయి. వినియోగదారులు రావడం చాలా అరుదైపోయింది, అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తీవ్ర ఎండల కారణంగా రైతులు రాత్రి వేళల్లో ఎల్ఈడీ లైట్ల వెలుగులో వ్యవసాయ పనులు చేస్తున్నారు. కూలీలు పగటిపూట పని చేయడానికి భయపడుతూ వేతనాల్లో 40 శాతం వరకు కోల్పోతున్నారని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. మధ్యాహ్నం వరకు తెరిచి ఉండే హోటళ్లు, టీ దుకాణాలు ఇప్పుడు సాయంత్రం తర్వాత మాత్రమే పనిచేస్తున్నాయి. విద్యుత్ డిమాండ్ భారీగా పెరగడంతో ట్రాన్స్‌ఫార్మర్లు వరుసగా దెబ్బతింటున్నాయి. జిల్లాలోని వేలాది ట్రాన్స్‌ఫార్మర్లపై విద్యుత్ శాఖ సిబ్బంది నీళ్లు పోస్తూ వాటిని చల్లబరచాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పర్యావరణ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ తీవ్ర పరిస్థితులకు వాతావరణ మార్పులతో పాటు స్థానిక పర్యావరణ నాశనం కూడా ప్రధాన కారణం. బండాలో భారీ స్థాయిలో మైనింగ్, అడవుల నరికివేత, నదుల్లో అక్రమ ఇసుక తవ్వకాలు సహజ సమతౌల్యాన్ని దెబ్బతీశాయి. పరిశోధనల ప్రకారం గత కొన్ని దశాబ్దాల్లో జిల్లాలో దట్టమైన అటవీ విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. నదీ ఇసుక తొలగిపోవడంతో భూగర్భ జలాల పునరుత్పత్తి తగ్గిపోయిందని, వింధ్య పర్వత ప్రాంతాల్లో పేలుళ్ల మైనింగ్ వల్ల నీటిని నిల్వ చేసే సహజ వ్యవస్థలు ధ్వంసమయ్యాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పచ్చదనం తగ్గిపోవడం, నీటి వనరులు ఎండిపోవడం, నేల వేడి పెరగడం వల్ల బండా ఇప్పుడు ‘హీట్ ఐలాండ్’గా మారింది. రాత్రివేళల్లో కూడా వేడి తగ్గడం లేదు, అని లక్నో విశ్వవిద్యాలయానికి చెందిన భూగర్భ శాస్త్రవేత్త ధ్రువ్ సేన్ సింగ్ తెలిపారు. స్థానికులు మాత్రం తక్షణ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో బండా నివాసయోగ్యం కాకపోవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us