
భువనేశ్వర్, జులై 12: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో సినీ ఫక్కీలో జరిగిన ఏటీఎం చోరీ సంచలనం రేపింది. దుండగుల ముఠా ఓ నల్లరంగు థార్ వాహనాన్ని ఉపయోగించి ఏటీఎంను పీకేసి, అందులోని నగదును దోచుకుని పరారైంది. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఖైరా పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో ఈ దోపిడీ జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఐదుగురికి పైగా దుండగులు నల్లరంగు థార్‌లో ఏటీఎం కేంద్రానికి చేరుకున్నారు. ముందుగా ఏటీఎం కియోస్క్‌లోకి చొరబడి, భారీ తాడుతో ఏటీఎం యంత్రాన్ని తమ వాహనానికి కట్టారు. అనంతరం వాహనాన్ని వేగంగా ముందుకు నడిపి ఏటీఎంను పూర్తిగా పీకేశారు. దీంతో కియోస్క్ నిర్మాణం ధ్వంసమై శకలాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. తర్వాత ఏటీఎంను రహస్య ప్రాంతానికి తీసుకెళ్లిన దుండగులు, యంత్రాన్ని పగులగొట్టి అందులోని నగదును తీసుకుని పరారయ్యారు. అయితే దోచుకున్న నగదు మొత్తం ఎంత అనేది ఇంకా వెల్లడికాలేదు.
సీసీటీవీ ఫుటేజీ ప్రకారం, రాత్రి 2:14 గంటలకు థార్ వాహనం ఏటీఎం కేంద్రం ముందు ఆగింది. కొందరు వ్యక్తులు వాహనం నుంచి దిగి భారీ తాడును తీసుకువచ్చి ఒక చివరను వాహనానికి, మరో చివరను ఏటీఎంకు కట్టారు. అనంతరం వాహనాన్ని వేగంగా నడిపి ఏటీఎంను బయటకు లాగేశారు. కేవలం మూడు నిమిషాల్లోనే ఆపరేషన్ పూర్తి చేసిన దుండగులు, 2:17 గంటలకు తిరిగి వాహనంలో ఎక్కి అక్కడి నుంచి పరారయ్యారు.
The crime portfolio of Thar is expanding. This is from Baleshwar in Odisha. pic.twitter.com/mHK6YueYvn
— Piyush Rai (@Benarasiyaa) July 11, 2026
గత కొన్ని నెలలుగా ఈ ప్రాంతంలో దొంగతనాలు, దోపిడీ ఘటనలు పెరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో రాత్రి వేళల్లో పోలీసు గస్తీని పెంచడంతో పాటు భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న ఖైరా పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ధ్వంసమైన ఏటీఎంను స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా థార్ వాహనం, దుండగుల గుర్తింపునకు ప్రయత్నిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.