ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో పలు కీలకనిర్ణయాలు తీసుకున్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రులకు ప్రధాని మోదీ దిశానిర్ధేశం చేశారు. నీతి ఆయోగ్ సమావేశానికి ఏడుగురు విపక్ష పాలిత రాష్ట్రాల సీఎంలు డుమ్మా కొట్టారు . కేంద్ర బడ్జెట్‌లో తమకు అన్యాయం జరిగిందని నిరసన తెలిపారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నీతి ఆయోగ్ 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. నీతి ఆయోగ్ సమావేశం నుంచి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. మధ్యలోనే వాకౌట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
బిహార్ సీఎం నితీష్‌కుమార్ అనారోగ్యం కారణంగా నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకాలేదు. ఆయన తరపున డిప్యూటీ ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి , విజయ్‌సిన్హా సమావేశానికి హాజరయ్యారు. తన మైక్‌ను కట్ చేశారని బెంగాల్ సీఎం మమత సమావేశం నుంచి వాకౌట్ చేయడం సంచలనం రేపింది. చంద్రబాబు 20 నిమిషాలు, ఇతర నేతలు 15 నిమిషాలు మాట్లాడారని, తనకు మాత్రం మైక్ కట్ చేశారని మమత ఆరోపించారు. తాను మాట్లాడుతుంటే అడ్డుకున్నారని, ఇది బెంగాల్‌కు, ప్రాంతీయ పార్టీలకు అవమానమన్నారు ఆమె. నీతి ఆయోగ్‌ను రద్దు చేసి ప్లానింగ్ కమిషన్‌ను తేవాలని మమత డిమాండ్ చేశారు.
వికసిత్ భారత్, వికసిత్ ఏపీ లక్ష్య సాధనకు అమరావతి, పోలవరం ప్రాజెక్టులు ఏ విధంగా ఉపకరిస్తాయో సమావేశంలో చంద్రబాబు వివరించారు. ఇక బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక కేటాయింపులు జరిపినందుకు నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోదీకి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్ ఎదగడానికి, 2047 నాటికి మన ఆర్థిక వ్యవస్థను 30 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి తీసుకెళ్లడం పైనా ప్రధానంగా చర్చించారు. ప్రజల జీవనాన్ని సులభతరం చేసేందుకు నాణ్యమైన విద్యుత్, శుద్ధి చేసిన తాగు నీరు, నాణ్యమైన వైద్యసేవలు, పాఠశాలలను అందుబాటులో ఉంచేందుకు ఏం చేయాలన్నదానిపై కూడా సమావేశంలో దృష్టి పెట్టారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..