Cheating Case: తానొక గొప్ప జ్యోతిష్యుడిగా ప్రకటించుకున్నాడు.. అంతటితో ఆగకుండా ప్రభుత్వ పెద్దలతో తనకు సాన్నిహిత్యం ఉందన్నాడు.. జాతీయ స్థాయిలో పెద్ద పదవులు ఇప్పిస్తానంటూ ఊదరగొట్టాడు.. అలా ఒక మాజీ న్యాయమూర్తికే రూ.8.27 కోట్లు టోకరా పెట్టాడు. చివరికి జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడు. బెంగళూరులో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బెంగళూరుకు చెందిన యువరాజ్ రాందాస్(52) తనకు తానుగా జ్యోతిష్యూడిగా ప్రకటించుకున్నాడు. అంతేకాకుండా తన వద్దకు వచ్చే భక్తులకు తనకు పెద్ద పెద్ద నాయకులతో, ప్రభుత్వ పెద్దలతో సంబంధాలు ఉన్నాయంటూ నమ్మబలికాడు. ఏ పని అయినా ఇట్టే చేసేస్తానంటూ చెప్పుకొచ్చాడు. ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ, ఉన్నత పదవులు కల్పిస్తానంటూ ఎంతోమందితో చెప్పాడు. అలా కర్ణాటకకు చెందిన రిటైర్డ్ జడ్జిని కూడా ఆ దొంగస్వామి నమ్మించాడు. తనకున్న పలుకుపబడితో ఢిల్లీ స్థాయిలో పెద్ద పదవి ఇప్పిస్తానని చెప్పి సదరు రిటైర్డ్ జడ్జి నుంచి రూ.8.27 కోట్ల మొత్తాన్ని కాజేశాడు. ఇదంతా 2018 జూన్, 2019 నవంబర్ మధ్య చోటు చేసుకుంది. అయితే సదరు న్యాయమూర్తికి తాను రిటైర్ అయ్యే వరకు కూడా ఉన్నత పదవి లభించకపోవడంతో.. యువరాజ్‌ను నిలదీశారు. ఈ క్రమంలో అతను చెప్పిందంతా మోసం అని గ్రహించిన ఆ రిటైర్డ్ జడ్జి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో దొంగ బాబా లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.
రిటైర్డ్ జడ్జి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. జాయింట్ కమిషనర్ సందీప్ పాటిల్ నేతృత్వంలో దొంగబాబా యువరాజ్ ఇంటిపై దాడులు జరిపారు. రూ. 26 లక్షల నగదుతో పాటు.. రూ. 91 కోట్ల విలువైన చెక్కులను స్వాధీనం చేసుకున్నారు. యువరాజ్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. కాగా, యువరాజ్ గత డిసెంబర్ నెలలోనే ఓ స్థల వివాదంలో యాంటిసిపేటరీ బెయిల్‌పై బయటకు వచ్చాడని పోలీసు అధికారి సందీప్ పాటి తెలిపారు.
Also read:
Wife Manhandling: బ్యాంకులో అందరూ చూస్తుండగానే భర్తకు దేహశుద్ధి చేసిన భార్య.. కారణమేంటంటే..