గ్లోబల్ దిగ్గజాలకు సవాల్ విసురుతున్న సర్వం ఏఐ.. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రశంసల జల్లు

టెక్నాలజీ అంటే నిన్నటి వరకు పశ్చిమ దేశాల వైపు చూసిన భారత్.. నేడు తన సొంత మేధస్సుతో ప్రపంచాన్నే తన వైపు తిప్పుకుంటోంది. సిలికాన్ వ్యాలీ దిగ్గజాలైన గూగుల్, ఓపెన్ ఏఐలకు సవాల్ విసురుతూ.. అచ్చమైన స్వదేశీ పరిజ్ఞానంతో సర్వం AI దూసుకపోతుంది.

గ్లోబల్ దిగ్గజాలకు సవాల్ విసురుతున్న సర్వం ఏఐ.. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రశంసల జల్లు
Ashwini Vaishnaw Praises Sarvam Ai

Updated on: Feb 08, 2026 | 2:41 PM

సాంకేతిక రంగంలో భారత్ మరో చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో దేశీయంగా అభివృద్ధి చెందిన సర్వం AI ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విదేశీ సాంకేతికతపై ఆధారపడకుండా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఈ మోడల్.. మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థల AI మోడళ్లకు గట్టి పోటీనిస్తోంది.

కేంద్ర మంత్రి ప్రశంసలు

కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సోషల్ మీడియా వేదికగా సర్వం AI సాధించిన విజయాన్ని కొనియాడారు. ప్రముఖ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, వెంచర్ క్యాపిటలిస్ట్ డిడి దాస్ చేసిన పోస్ట్‌ను రీ-పోస్ట్ చేస్తూ.. భారత సార్వభౌమ ఏఐ వ్యూహం ఫలితాలను ఇస్తోందని ఆయన తెలిపారు. గతంలో గూగుల్ వంటి దిగ్గజ సంస్థల్లో పనిచేసిన డిడి దాస్, సర్వం AI సామర్థ్యాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘‘ఒక ఏడాది క్రితం ఇండిక్ లాంగ్వేజ్ మోడల్స్ గురించి నాకున్న అంచనా తప్పు అని సర్వం నిరూపించింది. దీని టెక్స్ట్-టు-స్పీచ్, OCR సామర్థ్యాలు అద్భుతం’’ అని ఆయన ప్రశంసించారు.

జెమిని, GPTని మించి.. సర్వం విజన్ దూకుడు

సర్వం AI తాజాగా ప్రారంభించిన సర్వం విజన్ అనే మల్టీ-మోడల్ ఇప్పుడు టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. ఇది కేవలం సాధారణ AI లాగా కాకుండా.. తెలుగు, హిందీ, తమిళం సహా 22 అధికారిక భారతీయ భాషల్లో అత్యంత ఖచ్చితత్వంతో పనిచేస్తుంది. ప్రాథమిక పరీక్షల్లో ఈ మోడల్ జెమిని 3 ప్రో, GPT-5.2 వంటి అంతర్జాతీయ మోడళ్ల కంటే మెరుగైన ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ ఫలితాలను కనబరిచినట్లు తెలుస్తోంది. తాటి ఆకులపై గ్రంథాలు, పాత రికార్డులు, చారిత్రక శాసనాల్లోని జ్ఞానాన్ని అర్థం చేసుకుని డిజిటలైజ్ చేయడంలో ఇది కీలక పాత్ర పోషించనుంది.

భవిష్యత్ ప్రణాళికలు

భారతీయ ఇంజనీర్లు కేవలం భాషా నమూనాలకే పరిమితం కాకుండా.. మెటీరియల్ సైన్స్, హెల్త్‌కేర్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో కూడా విప్లవాత్మక AI మోడళ్లను సిద్ధం చేస్తున్నారని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇవి త్వరలోనే ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించనున్నాయని చెప్పారు. తక్కువ ఖర్చుతో, సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలా రూపొందించిన సర్వం AI వెబ్‌సైట్, దాని పనితీరు, భారతీయ టెక్ పరిశ్రమ ఏ స్థాయికి చేరుకుందో చాటిచెబుతోంది.