
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఒడిశా నుంచి రాజ్యసభ బరిలో నిలుస్తున్న బీజేపీ అభ్యర్థికి ఆ రాష్ట్రంలోని అధికార బీజూ జనతాదళ్ (బీజేడీ) మద్ధతు ప్రకటించింది. కేంద్ర రైల్వే, టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఒడిశా నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్నారు. అశ్విని వైష్ణవ్ రాజ్యసభ పదవీకాలం ముగియడంతో మరోసారి ఒడిశా నుంచి బీజేపీ అవకాశం కల్పించింది. అశ్విని వైష్ణవ్ అభ్యర్థిత్వాన్ని బీజేపీ బుధవారం ఉదయం అధికారికంగా ప్రకటించింది. రాజకీయాల్లోకి రాకముందు ఒడిశా క్యాడర్ ఐఏఎస్ అధికారిగా అశ్వని వైష్ణవ్ పనిచేశారు. 2019లో ఆయన తొలిసారి ఒడిశా నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అప్పట్లో కూడా బీజేడీ ఆయనకు మద్ధతిచ్చింది. ఇప్పుడు రెండోసారి కూడా అశ్వినీ వైష్ణవ్‌కి బీజేడీ మద్ధతు ప్రకటించడం విశేషం. పలు కీలక అంశాల్లో కేంద్ర ప్రభుత్వానికి నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ మద్ధతు ఇస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి బీజేపీ రాజ్యసభ అభ్యర్థికి బీజేడీ మద్ధతు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
ఒడిశాలో ఖాళీ అయిన మొత్తం మూడు స్థానాల్లో రెండు స్థానాలకు తమ పార్టీకి చెందిన ఇద్దరు అభ్యర్థులను బీజేడీ ఇప్పటికే ప్రకటించింది. మూడో సీటును బీజేపీకి విడిచిపెట్టగా.. ఈ సీటును అశ్విని వైష్ణవ్‌ను బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది. అలాగే కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ బరిలో నిలుస్తున్నట్లు తెలిపింది. అలాగే ఉమేష్ నాథ్ మహారాజ్, మాయా నరోలియా, బన్సిలాల్ గుర్జార్‌లు కూడా మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించింది.
ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఫిబ్రవరి 15 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ కాగా.. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 20 వరకు గడువు ఉంది. 15 రాష్ట్రాలకు చెందిన 56 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్ నెలతో ముగియనుంది.
గత వారం రాజ్యసభ ఎన్నికల్లో పోటీచేసే 14 మంది అభ్యర్థుల పేర్లను బీజేపీ ప్రకటించింది.మాజీ కేంద్ర మంత్రి ఆర్పీఎన్ సింగ్, సుధాంషు త్రివేదీ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.