ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఇక నగరంలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఫిబ్రవరి 8 న ఢిల్లీ శాసన సభకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత మూడు రోజులకే ఫలితాలను ప్రకటిస్తారు.. మంగళవారం నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో జామ్ నగర్ లోని ఎలెక్షన్ కార్యాలయం వద్ద సందడి నెలకొంది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన నామినేషన్ వేసేందుకు ఈ కార్యాలయం వద్ద చాలాసేపు వేచిఉండవలసి వచ్చింది. పెద్ద సంఖ్యలో ఇండిపెండెంట్ అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేసేందుకు క్యూలో నిలబడి ఉండడమే ఇందుకు కారణం. కేజ్రీవాల్ సోమవారమే నామినేషన్ దాఖలు చేయవలసి ఉండగా.. తన ఆప్ పార్టీ నేతలు, కార్యకర్తలతో రోడ్ షో నిర్వహించడంతో చాలా జాప్యం జరిగి ఆయన నామినేషన్ వేయలేకపోయారు. అయితే ఇవాళ ఆయనకు దాదాపు చేదు అనుభవం ఎదురైంది.
సుమారు 50 మంది స్వతంత్ర అభ్యర్థులు తమ మద్దతుదారులతో ఇందుకు వేచి ఉండడంతో కేజ్రీవాల్ కు కూడా క్యూలో నిలబడక తప్పలేదు. ఈ అభ్యర్థుల్లో ఒకరు.. కసిగా.. ఆయనను ఈ కార్యాలయంలోకి ఎంటర్ కానివ్వం అన్నాడు. ‘మా లాగే ఆయన కూడా క్యూలో నిలబడాల్సిందే.. ‘ అన్నాడా అభ్యర్థి.. ఇందుకు ఆయన కారణాన్ని చెబుతూ.. అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నాహజారే ఆధ్వర్యాన అవినీతి వ్యతిరేక ప్రచారం సాగుతుండగా.. తమలాంటివారికి కేజ్రీవాల్ ద్రోహం చేశారని ఆరోపించారు. మరో అభ్యర్థి.. తనతో బాటు సుమారు 30 మంది సపోర్టర్స్ తనవెంట ఉన్నారని, వారంతా తమ నామినేషన్లు దాఖలు చేస్తారని అన్నారు. ఢిల్లీ నుంచి ఆప్ క్యాండిడేట్ గా పోటీ చేస్తున్న కేజ్రీవాల్.. తన కుటుంబ సభ్యులతో సహా నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చారు.