ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద పేదలకు ఉచితంగా 5 కిలోల బియ్యం అందించాలని కేంద్రం నిర్ణయించింది. 2024 జనవరి 1 నుంచి మరో ఐదేళ్లపాటు 81 కోట్ల మంది అర్హులకు నెలకు ఒకరికి 5 కిలోల చొప్పున రేషన్ ఉచితంగా అందించనున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ తెలిపారు. ఈ పథకానికి వచ్చే ఐదేళ్లలో రూ.11.8లక్షల కోట్లు ఖర్చవుతుందని అన్నారు. దేశంలో కొవిడ్ విజృంభించిన సమయంలో పేదలకు అండగా ఉండేందుకు ఈ పథకాన్ని 2020లో కేంద్ర సర్కార్ ప్రవేశపెట్టింది.
“ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద పేద ప్రజలకు 2024 జనవరి 1 నుంచి మరో ఐదేళ్లపాటు ఉచితంగా 5 కిలోల బియ్యం అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం ద్వారా 81 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుంది” అని అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు.
మరోవైపు..డ్వాక్రా గ్రూపులకు వ్యవసాయ డ్రోన్‌లను అందించే పథకానికి కేంద్ర మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.15వేల డ్వాక్రా గ్రూపులకు డ్రోన్లు అందించి వారికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. వ్యవసాయ అవసరాల కోసం రైతులకు ఈ డ్రోన్‌లను డ్వాక్రా గ్రూపులు అద్దెకు ఇవ్వనున్నాయి. 2023 నుంచి 2026 మధ్యకాలంలో ఎంపిక చేసిన 15వేల డ్వాక్రా గ్రూపులకు డ్రోన్లు అందించనున్నట్లు కేంద్ర తెలిపింది. కేంద్రం, రాష్ట్రాల మధ్య పన్ను రాబడిని పంచుకోవడంపై నిర్ణయం తీసుకునే 16వ ఆర్థిక సంఘం విధివిధానాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 16వ ఆర్థిక సంఘం తన నివేదికను 2025 అక్టోబర్ నాటికి సమర్పిస్తుంది.2026 ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే ఐదేళ్ల కాలానికి సిఫార్సులు చెల్లుబాటు అవుతాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…