
15 సంవత్సరాల క్రితం పెళ్లైంది.. ఇద్దరు పిల్లలు.. అన్యోన్య దాంపాత్యం.. భర్తకు మంచి ఉద్యోగం.. ఆమె ఇంట్లోనే ఉండి పిల్లను చూసుకునేది.. కట్ చేస్తే.. ఇంతలోనే భార్యకు పాఠశాలలో చదువుకున్న పాత స్నేహితుడు పరిచయమయ్యాడు. ఈ క్రమంలోనే ఇద్దరూ మాట్లాడుకున్నారు.. తాను రియల్ ఎస్టెట్ వ్యాపారినని.. కోట్ల రూపాయలు సంపాదించానని చెప్పడంతో.. ఆమె అతనికి దగ్గరైంది.. ఆ తర్వాత ఒకరినొకరు ఇష్టపడ్డారు.. పాత ప్రేమ సరికొత్తగా చిగురించింది.. సాన్నిహిత్య సంబంధం కొనసాగించింది. భర్త వద్దన్నా వినలేదు.. విడాకులు కావాలని నోటీసులు పంపింది.. భర్తను వదిలిపెట్టి.. ప్రియుడితో రిలేషన్ కొనసాగించింది.. చివరకు ప్రియుడితో కలిసి జీవించేందుకు కన్న కూతురిని చంపింది.. ఈ దారుణ ఘటన కర్ణాటకలో కలకలం రేపింది.. ప్రియుడితో కలిసి జీవించేందుకు అడ్డుగా ఉందని తన కుమార్తె వెన్నెల (5)ను హత్య చేసిన తల్లి ప్రియాంకను కాడుగోడి పోలీసులు గురువారం హాసనలో అరెస్టు చేశారు.. అంతకుముందు ప్రియుడును పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి..
దావణగెరెకు చెందిన ప్రవీణ్- ప్రియాంకకు 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. ప్రవీణ్ ఒక ప్రైవేటు కంపెనీ ఉద్యోగిగా ఉండగా.. ప్రియాంక న్యాయవాదిగా పనిచేస్తున్నారు. వీరికి 11 ఏళ్ల కుమారుడు, 5ఏళ్ల కుమార్తె ఉన్నారు. కాడుగోడిలో ఉంటున్న సమయంలో తనతో కలిసి పాఠశాలలో చదువుకున్న మోహన్ పరిచయమై.. రియల్ ఎస్టేట్ వ్యాపారిగా పనిచేస్తున్నానని.. కోట్ల డబ్బులు ఉన్నాయని చెప్పాడు. అయితే.. అదంతా అబద్దమని.. అతను అద్దె ఇంట్లో ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రియాంక, మోహన్ సాన్నిహిత్యం గురించి తెలిసి.. భర్త ప్రవీణ్ ముందే హెచ్చరించాడని పోలీసులు వివరించారు. దీంతో ప్రియాంక కుమార్తెను తీసుకుని ఇల్లు వదిలి వెళ్లి.. మోహన్‌తో సహజీవితాన్ని ప్రారంభించి.. భర్తకు విడాకుల నోటీసులు కూడా పంపించింది. ఈ క్రమంలోనే.. వెన్నెల అనారోగ్యం పాలై మరణించిందని భర్తకు, తన సోదరునికి చెప్పింది. అంత్యక్రియలు పూర్తయ్యాయని, పోస్టుమార్టం నివేదికను భర్తకు పంపింది. అయితే.. దానిని ప్రవీణ్ విదేశాల్లో ఉన్న ఒక వైద్యునికి పంపగా.. నివేదిక సరిగా లేదని చెప్పడంతో అతను పోలీసులను ఆశ్రయించాడు..
బెంగళూరు నగరంలోని కడుగోడి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన బాలిక హత్య కేసు ఇప్పుడు పెద్ద వివాదానికి కారణమైంది. తల్లి, ఆమె ప్రియుడు కలిసి చిన్నారిని హత్య చేసిన ఈ కేసుకు సంబంధించి ముగ్గురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. ఈ కేసు దర్యాప్తులో పోలీసుల వైఫల్యం ఉన్నట్లు తేలడంతో, ఆ ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ తెలిపారు. వాస్తవానికి వెన్నెల అనే చిన్నారి మార్చి నెలలో మరణించింది. ఆ సమయంలో, ఈ కేసును అసహజ మరణ నివేదిక (UDR)గా నమోదు చేశారు. అంటే, మరణం చుట్టూ అనుమానాస్పద పరిస్థితులు ఉన్నప్పటికీ, దానిని ఇంకా హత్య కేసుగా పరిగణించలేదు. అందువల్ల, పోలీసుల దర్యాప్తులో లోపం జరిగిందని అంటున్నారు. కేసు దర్యాప్తు లోపభూయిష్టంగా ఉండటంతో అధికారులను సస్పెండ్ చేశారు.. ప్రస్తుతం, మరిన్ని వివరాలు, అనుమానాల నేపథ్యంలో, జూన్ 4న ఈ కేసును హత్య కేసుగా నమోదు చేశారు. ఇప్పుడు తలెత్తుతున్న పెద్ద ప్రశ్న ఏమిటంటే, చిన్నారి మరణంపై మొదటి నుంచీ సరైన దర్యాప్తు జరపాల్సిన అధికారులు దానిని సరిగ్గా చేపట్టలేదని అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో కడుగోడి పోలీస్ స్టేషన్ అప్పటి ఇన్‌స్పెక్టర్ రంగస్వామి, పీఎస్ఐ నింగరాజు, ఒక కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వారిపై శాఖాపరమైన స్థాయిలో తదుపరి విచారణ జరుపుతామని నగర పోలీస్ కమిషనర్ తెలిపారు. అధికారులు ఎందుకు సకాలంలో చర్యలు తీసుకోలేదు, వారి ఉద్దేశం ఏమిటి, అది నిర్లక్ష్యమా లేక మరేదైనా కారణమా అనే విషయాలను పోలీసులు ఇప్పుడు వివరంగా పరిశీలిస్తున్నారు. ఈ కేసు తదుపరి విచారణను ఇప్పుడు మరో అధికారికి అప్పగించారు.
ఈ కేసు వెనుక ఉన్న కుటుంబ సంబంధిత విషయం కూడా చర్చకు వచ్చింది. కడుగోడిలో తల్లి, ఆమె ప్రియుడు కలిసి ఆ బిడ్డను హత్య చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, మరో ముఖ్యమైన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రియాంక అనే మహిళ తన ప్రియుడు మోహన్‌తో కలిసి ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) ద్వారా మరో బిడ్డను కనాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
మే 21న ప్రియాంక, మోహన్ కూడా ఆసుపత్రికి వెళ్లారు. ఆ రోజు ఐవీఎఫ్ ప్రక్రియ కోసం అండాల నమూనాలను కూడా సేకరించినట్లు రికార్డులు చూపిస్తున్నాయి. వారు మదర్‌వుడ్ ఆసుపత్రిలో ఐవీఎఫ్ ద్వారా బిడ్డను కనబోతున్నారని డిశ్చార్జ్ సారాంశం రికార్డుల ద్వారా స్పష్టమయినట్లు అధికారులు తెలిపారు. కొత్త బిడ్డ కోసం ఐవీఎఫ్ ప్రక్రియ జరుగుతున్న సమయంలోనే, బిడ్డ మరణాన్ని హత్య కేసుగా మార్చడం దర్యాప్తులో మరిన్ని అనుమానాలను రేకెత్తించింది. దీంతో, పోలీసులు ఇప్పుడు తల్లి, ఆమె ప్రియుడి ఉద్దేశాలు, వారి ప్రణాళిక, బిడ్డ హత్యకు, ఐవీఎఫ్‌కు మధ్య ఏమైనా సంబంధం ఉందా అనే విషయాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ప్రస్తుతం, నిందితులు ఇద్దరూ పోలీసుల అదుపులో ఉన్నారు.. వారిని విచారిస్తున్నారు. చిన్నారి మరణానికి ఖచ్చితమైన కారణం, హత్య ఎప్పుడు, ఎలా జరిగింది, ఇందులో మరెవరైనా ప్రమేయం ఉందా, పోలీసుల మునుపటి నిర్లక్ష్యం వెనుక కారణం ఏమిటి అనే విషయాలపై దశలవారీగా దర్యాప్తు జరుగుతోంది. ఈ కేసులో ఏ అధికారి తప్పునూ దాచిపెట్టబోమని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ ప్రకటనలో తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..