దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఢిల్లీ-జయపుర రహదారిని దిగ్బంధానికి పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు గత 17 రోజులుగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. తొలుత పంజాబ్-హర్యానా రాష్ట్రాలకు చెందిన రైతులు మాత్రమే ఆందోళనలో పాల్గొనగా.. ఆ ఉద్యమం క్రమంగా దేశ వ్యాప్తంగా విస్తరిస్తోంది. ఆదివారం నాడు రాజస్థాన్ నుంచి రైతులు ట్రాక్టర్లతో ఢిల్లీకి ర్యాలీగా వెళ్తున్నట్లు ప్రకటించారు. అక్కడి నుంచి ఢిల్లీ-జయపుర రహదారిని దిగ్బంధిస్తామని ప్రకటించారు. అలాగే సోమవారం నాడు సింఘు సరిహద్దుల్లో నిరాహార దీక్ష చేపడతామని రైతు సంఘం నాయకులు ప్రకటించారు. ఈనెల 19వ తేదీలోగా తమ డిమాండ్లను అంగీకరించకపోతే ఆమరణ దీక్షకు సైతం వెనుకాడబోమని రైతు సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వానికి అల్టీమేటం జారీ చేశారు. అయితే, శాంతియుతంగా పోరాటం సాగిస్తున్న రైతుల మధ్య చిచ్చులు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్ని్స్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం కుట్రలు చేయడం మానుకోవాలన హితవు చెప్పారు.