పౌరసత్వ సవరణ చట్టం మైనార్టీలకు వ్యతిరేకం కాదన్నారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ చట్టాన్ని ఉపసంహరించే ప్రసక్తే లేదన్నారు. జోధ్ పూర్ లో నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ ఈ చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. దమ్ముంటే చర్చించేందుకు ముందుకు రావాలన్నారు. ఒకవేళ వారికి దమ్ము లేకపోతే.. ఇటాలియన్ భాషలోకి అనువదించి ఇస్తామంటూ సోనియా గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మైనార్టీలు, యువతకు చేరువ కావడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తోందని అమిత్ షా అన్నారు.
కాగా, పాకిస్థాన్ నుంచి వచ్చిన శరణార్థులు శుక్రవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టం వల్ల తమకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఓ జ్ఞాపికను కూడా బహూకరించారు. ఈ చట్టం ప్రకారం.. ఆఫ్ఘన్, పాక్, బంగ్లాదేశ్‌లలో మతపరమైన వేధింపులు, హింసాత్మక సంఘటనల కారణంగా, ఆ దేశాల్లోని మైనారిటీలైన హిందువులు, బౌద్ధులు, సిక్కులు, పార్సీలు, జైనులు, క్రైస్తవులు.. 2014 డిసెంబరు 31న లేదా అంతకుముందు భారత దేశంలో ప్రవేశించినట్లయితే, వారికి భారత దేశ పౌరసత్వం ఇవ్వవచ్చు.