కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి దాటికి ఆస్పత్రుల బెడ్లన్నీ ఫుల్ అవుతున్నాయి. ఇక కరోనా బారినపడ్డ వ్యక్తులను ఆస్పత్రులకు తరలించాలంటే.. ప్రత్యేకంగా అంబులెన్స్‌లను ఏర్పాటు చేస్తున్నాయి ప్రభుత్వాలు. అటు ప్రేవేటు అంబులెన్సులు కూడా కరోనా పేషెంట్స్‌ను ఆస్పత్రులకు తరలించేందుకు ప్రత్యేక ధరలను వసూలు చేస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని ఓ ప్రైవేటు అంబులెన్స్ కరోనా సోకిన పేషెంట్‌ను ఆస్పత్రికి తరలించేందుకు వసూలు చేసిన ధరను చూస్తే షాక్ తినాల్సిందే. ఏడు కిలో మీటర్ల దూరానికి ఏకంగా రూ.8 వేల రూపాయలను సదరు కరోనా పేషెంట్ కుటుంబ సభ్యుల నుంచి వసూలు చేశారు. ఈ సంఘటన రాష్ట్రంలోని పూణెలో చోటుచేసుకుంది. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు సదరు అంబులెన్స్ నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బిబ్వేవాడీ ప్రాంతంలోని ఓ ఆస్పత్రిలో ఓ వ్యక్తికి కరోనా పరీక్షలు జరపగా.. అతడికి పాజిటివ్‌గా తేలింది. దీంతో అతడు ఎరండ్వానే అనే ప్రాంతంలో ఉన్న ఆస్పత్రికి వెళ్లేందుకు రెడీ అయ్యారు. ఆయన ఉంటున్న నివాసానికి ఆ ఆస్పత్రి ఏడు కిలో మీటర్ల దూరంలో ఉంది. అయితే సదరు కరోనా సోకిన వ్యక్తి.. ఓ ప్రైవేట్ అంబులెన్సును ఆశ్రయించాడు. అయితే ఆ అంబులెన్స్ లో ఆ కరోనా సోకిన వ్యక్తి ఆస్పత్రికి చేరుకున్నాడు. అయితే ఇందుకు అంబులెన్సుకు రూ.8 వేలు చెల్లించాల్సి వచ్చింది. 7 కిలో మీటర్లకు రూ.8వేలు వసూలు చేసినందుకు గాను.. అంబులెన్స్ నిర్వాహకుడిపై అధికారులు పలు చట్టాల కింద కేసులు నమోదు చేశారు.