Punjab Elections 2022: పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేసేది క్లారిటీ ఇచ్చేశారు. పంజాబ్‌లో తమ కుటుంబానికి కంచుకోటలాంటి పాటియాలా అసెంబ్లీ నియోజకవర్గం నుంచే ఆయన పోటీ చేయనున్నారు. తన ఫేస్‌బుక్ పేజ్‌లో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. పాటియాలా నుంచే తాను పోటీ చేస్తానంటూ ఆయన స్పష్టంచేశారు. తమ కుటుంబానికి పాటియాలాతో 400 ఏళ్ల అనుబంధం ఉందని ఆయన గుర్తుచేసుకున్నారు. సిద్ధూ కారణంగా ఈ బంధాన్ని తెంచుకుని మరోచోటికి వెళ్లబోనని స్పష్టంచేశారు.
పాటియాలా నియోజకవర్గం అమరీందర్ సింగ్ కుటుంబానికి గత కొన్ని దశాబ్ధాలుగా కంచుకోటలా ఉంది. పాటియాలా నుంచి కెప్టెన్ అమరీందర్ సింగ్ 4 సార్లు (2002, 2007, 2012, 2017) ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అమృతసర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికకావడంతో 2014లో అమరీందర్ సింగ్ పాటియాలా అసెంబ్లీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ఆయన సతీమణి ప్రణీత్ కౌర్ పోటీ చేసి గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుంచి ఆమె మూడుసార్లు ప్రాతినిధ్యంవహించారు.
సిద్ధూకు దమ్ముంటే పాటియాలా నుంచి పోటీ చేసి గెలవాలంటూ ఏప్రిల్ నెలలో అమరీందర్ సింగ్ సవాలు చేశారు. అక్కడి నుంచి పోటీ చేస్తే.. సిద్ధూకు డిపాజిట్లు కూడా దక్కవని ఎద్దేవా చేశారు. సిద్ధూతో నెలకొన్న విభేదాల కారణంగా కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు సెప్టెంబర్ మాసంలో అమరీందర్ సింగ్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. అమరీందర్ సింగ్ స్థానంలో చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఆ రాష్ట్ర సీఎం అయ్యారు. 2022 ఎన్నికల్లో సిద్ధూ ఎక్కడి నుంచి పోటీ చేసినా.. తాము బలమైన అభ్యర్థిని బరిలో నిలిపి ఓడిస్తామంటూ అమరీందర్ సింగ్ ఇప్పటికే ప్రకటించారు.
పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరుతే కొత్త పార్టీని ఏర్పాటు చేసుకున్న అమరీందర్ సింగ్.. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేయనున్నారు. అలాగే శిరోమణి అకాలీదళ్ చీలికవర్గంతో వచ్చే ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు ఉండే అవకాశముందని ఇప్పటికే ఆయన సంకేతాలిచ్చారు. పొత్తు సాధ్యంకాని పక్షంలో అన్ని స్థానాల్లో తమ పార్టీ ఒంటరిగానే బరిలో నిలుస్తుందని ప్రకటించారు.
Also Read..