High Court: భారతీయ మహిళలు తమ భర్తను ఇతరులతో పంచుకోవాలనుకోరు.. అలహాబాద్ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు
భారతీయ మహిళ ఎవరూ తన భర్తను వేరొకరితో పంచుకోవాలనుకోరని, ఆత్మహత్య కేసు విచారణ సందర్భంగా అలహాబాద్ హైకోర్టు పేర్కొంది.
Allahabad High Court: భారతీయ మహిళ ఎవరూ తన భర్తను వేరొకరితో పంచుకోవాలనుకోరని, ఆత్మహత్య కేసు విచారణ సందర్భంగా అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. భారతదేశంలోని మహిళలు తమ భర్తల పట్ల అంకిత భావం, పొసెసివ్‌గా ఉంటారని, వారు తమ భర్తలను ఎవరితోనూ పంచుకోలేరని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆత్మహత్యకు ప్రేరేపించిన నిందితులను విడుదల చేయాలన్న అప్పీల్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. అదనపు సెషన్స్ జడ్జి ఆదేశాలను సవాల్ చేస్తూ వారణాసి వాసి చేసిన అప్పీల్‌ను కొట్టివేస్తూ జస్టిస్ రాహుల్ చతుర్వేది ఈ వ్యాఖ్యలు చేశారు.
వారణాసిలోని మదువాది పోలీస్ స్టేషన్‌లో ఒక మహిళ ఆత్మహత్య కేసు నమోదైంది. ఈ కేసులో ఆమె భర్త సుశీల్ కుమార్ ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను కొట్టివేయాలంటూ భర్త కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే కేసు విచారణ సందర్భంగా అలహాబాద్ హైకోర్టు సుశీల్ కుమార్ సహా మరో 6 మంది పిటిషన్‌ను కొట్టివేసింది.
భారతీయ మహిళ ఎట్టిపరిస్థితుల్లోనూ తన భర్తను ఇతరులతో పంచుకోలేరని కోర్టు పేర్కొంది. ఆమె తన భర్త గురించి నిజంగా పొసెసివ్‌గా ఉంటుంది. ఏ వివాహిత అయిన స్త్రీకి తన భర్త మరొక స్త్రీతో పంచుకోవడం లేదా అతను మరొక స్త్రీని వివాహం చేసుకోబోతున్నాడనేది అతిపెద్ద దెబ్బ అవుతుంది. అటువంటి విచిత్రమైన పరిస్థితిలో, అతని నుండి ఎలాంటి అవగాహనను ఆశించడం అసాధ్యమని కోర్టు పేర్కొంది.
అసలేం జరిగింది…
వారణాసి నివాసి అయిన సుశీల్ కుమార్‌పై 22 సెప్టెంబర్ 2018న పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. నిందితుడు సుశీల్ కుమార్ తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే పెళ్లి చేసుకున్నాడు. తన భర్తకు ఇదివరకే పెళ్లయిందని, ఇద్దరు పిల్లలకు తండ్రి అని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదిలావుండగా, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రహస్యంగా మూడో పెళ్లి చేసుకున్నాడు. దీనితో పాటు, తన భర్త, అత్తమామలపై కూడా మహిళ మానసిక వేధింపులకు పాల్పడుతున్నారని పేర్కొంది. భర్త, అత్తమామలపై ఫిర్యాదు చేయడంతో పాటు మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆ తర్వాత పోలీసులు దర్యాప్తు ప్రారంభించి భర్త,అత్తమామలపై ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.