AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అంటే ఇదే! జైలర్‌గా పనిచేసి.. అదే జైలుకు ఖైదీగా..!

రాజస్థాన్ అజ్మీర్‌లో సంచలనం సృష్టించిన కేసులో మాజీ జైలర్ దివ్య చౌదరి అరెస్ట్ అయ్యారు. మహిళా ఖైదీలను నిబంధనలకు విరుద్ధంగా బయటకు తీసుకెళ్లి తన ఇంట్లో పనులు చేయించిన ఆమె, రెండు నెలల పరారీ తర్వాత సైబర్ సెల్ సాయంతో పట్టుబడ్డారు. ఇప్పుడు తను పనిచేసిన జైలులోనే ఖైదీగా మారడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన జైళ్ల నిర్వహణ లోపాలను ఎత్తిచూపుతోంది.

బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అంటే ఇదే! జైలర్‌గా పనిచేసి.. అదే జైలుకు ఖైదీగా..!
Ajmer Jailer Arrest
Balaraju Goud
|

Updated on: Oct 08, 2026 | 2:55 PM

Share

రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళా ఖైదీలను నిబంధనలకు విరుద్ధంగా జైలు నుంచి బయటకు తీసుకెళ్లి తన ఇంట్లో పనులు చేయించిన కేసులో అప్పటి మహిళా జైలర్ దివ్య చౌదరిని పోలీసులు అరెస్టు చేశారు. రెండు నెలలుగా పరారీలో ఉన్న ఆమెను అజ్మీర్ పోలీసుల సైబర్ సెల్ సాంకేతిక ఆధారాలతో కోటాలో గుర్తించి అదుపులోకి తీసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం.. ఈ ఘటన 2026 జూలై 12న చోటుచేసుకుంది. అప్పట్లో అజ్మీర్ మహిళా జైలుకు ఇన్‌చార్జిగా ఉన్న దివ్య చౌదరి, మహిళా గార్డు సోనియా చౌదరితో కలిసి జీవిత ఖైదు అనుభవిస్తున్న కిరణ్, సానా అనే ఇద్దరు ఖైదీలను నిబంధనలకు విరుద్ధంగా జైలు నుంచి బయటకు తీసుకెళ్లారు. జైలు రికార్డుల్లో నమోదు చేయకుండా, ప్రైవేట్ వాహనంలో వారిని అజ్మీర్‌లోని ఏఆర్‌జీ సిటీలో ఉన్న తన ప్రైవేట్ ఫ్లాట్‌కు తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి.

అక్కడ ఇద్దరు ఖైదీలతో ఇంటిని శుభ్రం చేయించడం, ఇతర ఇంటి పనులు చేయించినట్లు అధికారులు తెలిపారు. ఖైదీలను బయటకు తీసుకెళ్లడాన్ని జైలు ప్రధాన ద్వారం వద్ద విధులు నిర్వహిస్తున్న మహిళా సిబ్బంది వ్యతిరేకించగా, జైలర్ దివ్య, సోనియా వారిని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. విషయం బయటకు రావడంతో ఇద్దరు ఖైదీలను తిరిగి జైలుకు తరలించారు.

శాఖాపరమైన విచారణ అనంతరం దివ్య చౌదరి, మహిళా గార్డు సోనియాను సస్పెండ్ చేశారు. అయితే సస్పెన్షన్ తర్వాత ఇద్దరూ తమకు కేటాయించిన హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయకుండా పరారయ్యారు. ఈ వ్యవహారంపై ఆగస్టు 5న అజ్మీర్ సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అజ్మీర్ ఎస్పీ హర్షవర్ధన్ అగర్వాల్ ఆదేశాలతో ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టింది. సైబర్ సెల్ మొబైల్ డేటా, సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దివ్య ఆచూకీని గుర్తించింది. కోటాలోని ఓ ఫ్లాట్‌లో ఆమెను అరెస్టు చేశారు.

అనంతరం కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆమెను జ్యుడిషియల్ కస్టడీకి పంపింది. దీంతో ఒకప్పుడు జైలర్‌గా పనిచేసిన అదే అజ్మీర్ సెంట్రల్ జైలుకు ఇప్పుడు ఖైదీగా దివ్య చౌదరి చేరడం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో మరో నిందితురాలైన మహిళా గార్డు సోనియా చౌదరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us