హైదరాబాద్‌లోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)లో అడ్మిషన్లు, ఉద్యోగ నిమయాకల్లో వెనుకబడ్డ వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన, ఇఫ్లూ సహా దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలో బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి వివరించారు. రాజ్యాంగబద్ధంగా వెనుకబడిన వర్గాలకు దక్కాల్సిన 27 శాతం రిజర్వేషన్లు దక్కడం లేదని, ఇఫ్లూలో కుట్రపూరితంగా బీసీలకు అధ్యాపక పోస్టులు దక్కకుండా చేస్తున్నారని ఆరోపించారు.
ఈ అంశంపై జాతీయ బీసీ కమిషన్‌కు గతంలోనే ఫిర్యాదు చేయగా, జనవరి 25న బీసీ కమిషన్ విచారణ చేపట్టిందని తెలిపారు. ఆనాటి విచారణకు హాజరైన ఇఫ్లూ అధికారులు నియామక ప్రక్రియ కోసం ఇచ్చిన నోటిఫికేషన్, ఇంటర్వ్యూలు రద్దు చేసి పూర్తి వివరాలతో ఫిబ్రవరి 2న హాజరుకావాల్సి ఉందని, అయితే ఇఫ్లూ వైస్ ఛాన్సలర్ సురేశ్ కుమార్ బేషజాలకుపోయి హాజరుకాకుండా బీసీలకు అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఇఫ్లూలోని 236 పోస్టుల్లో 27 శాతం, అంటే 63 ఉద్యోగాలు బీసీలకు కేటాయించాల్సి ఉండగా, 23 పోస్టులు మాత్రమే బీసీలకు కేటాయిస్తూ నోటిఫికేషన్ ఇచ్చారని శ్రవణ్ మండిపడ్డారు. కేవలం అధ్యాపక పోస్టుల నియామకాల్లోనే కాదు, పీహెచ్డీ అడ్మిషన్లలోనూ బీసీలకు అన్యాయం చేస్తున్నారని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. అడ్మిషన్లైనా, నియామకాలైనా యూజీసీ నిబంధనల ప్రకారం బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ చేపట్టాలని హితవు పలికారు. యూనివర్సిటీలు తమ సొంత జాగీర్లు కాదని ఆయన అన్నారు.
Also read :