యూపీ రాజకీయాల్లో సీనియర్ రాజకీయ నేత, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అజాంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలకు మరోపేరు. ఆయన ప్రస్తుతం విచిత్రమైన కేసుల బెడదతో సతమతమవుతున్నారు. ఇప్పటివరకు ఆయనపై 82 కేసులు నమోదయ్యాయి. వీటన్నిటిలో ప్రధానమైనవి భూ కబ్జాఆరోపణలే. సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలిచే ఆజాంఖాన్ తాజాగా ఒక విచిత్రమైన కేసులో ఇరుకున పడ్డారు.
సమాజ్‌వాదీ పార్టీకి చెందిన అజాంఖాన్ ఆపార్టీలో సీనియర్ నేత. ఆయనపై ఎన్నో ఆరోపణలున్నాయి. ఇప్పటికే ఆయనపై పదుల సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటన్నిటిపై దర్యాప్తు చేయడం ఉత్తరప్రదేశ్ పోలీసులకు తలకుమించిన భారంగా పరిణమించింది. యతీంఖాన్ సరాయ్ గేట్ ప్రాంతానికి చెందిన ససీమా ఖాతూన్ (50) అనే మహిళ 2016లో అక్టోబర్ 15వ తేదీన ఎంపీ అజాంఖాన్ తన మేకలు దొంగిలించారంటూ స్ధానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆయన 25 మంది అనుచరులతో కలిసి తన ఇంటిపై దాడి చేశారని, తన ఇంట్లో ఉన్న బంగారం, గేదెలు, ఆవులు, నాలుగు మేకల్ని వీరంతా ఎత్తుకుపోయారంటూ ఆరోపించింది. తాను వక్ఫ్ బోర్డుకు చెందిన భూమిలో కౌలుదారునని, రెండు దశాబ్దాలుగా కౌలుదారుగా ఉన్నానంటూ నసీమా తన ఫిర్యాదులో పేర్కొంది. వక్ఫ్‌కి చెందిన భూమిని కబ్జా చేయడానికి అజాంఖాన్ ప్రయత్నిస్తున్నాడని ఆమె ఆరోపించింది.
నసీమా ఖాతున్ ఈ ఫిర్యాదును 2016లో చేయగా .. ఉత్తరప్రదేశ్ పోలీసులు మాత్రం ఇన్నాళ్లకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఒక ఎంపీ నాలుగు మేకలు దొంగిలించారని ఆరోపించడం స్ధానికంగా కలకలం రేపుతోంది. ఇదిలా ఉంటే ఆజాంఖాన్ భార్య కరెంట్ దొంగిలించారనే కేసు కూడా నమోదైంది. అయితే ఇటువంటి కేసులు ఎంపీ అజాంఖాన్‌కు కొత్తేమీ కాదని, ఇలాంటి ఎన్నో నమోదయ్యాయంటున్నారు స్ధానికులు.