African swine fever virus: దేశంలో కరోనా అలజడి రేపుతోంది. దీంతోపాటు వెలుగులోకి వస్తున్న కోవిడ్ వేరియంట్లు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా భారత్‌లో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ కలకలం రేపింది. త్రిపుర (Tripura) రాష్ట్రంలోని సెపాహిజాలా జిల్లాలో ఉన్న దేవిపూర్‌లో జంతువనరుల శాఖ నిర్వహిస్తున్న ఫామ్‌లో ఈ కేసులను గుర్తించినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూను గుర్తించిన వెంటనే అధికారులు అలర్ట్ అయ్యారు. ఫామ్‌లోని చాలా పందులకు ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉండటంతో… అది ఫామ్ మొత్తం పాకి ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటివరకూ ఆఫ్రికన్ ఫ్లూ బారినపడి 63 వరకు పందులు మృతిచెందినట్టు అధికారులు పేర్కొన్నారు. అగర్తలలోని నిపుణుల బృందం సోమవారం ఫామ్‌కు చేరుకొని అక్కడి పరిస్థితులను సమీక్షించింది. దీంతోపాటు త్రిపురలో పరిస్థితులను అంచనా వేసేందుకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఏప్రిల్ 7న 3 శాంపిల్స్ సేకరించిన బృందం.. పరీక్షల కోసం ఈశాన్య ప్రాంతీయ వ్యాధి నిర్ధారణ లాబోరేటరీ (NERDDL)కి పంపింది. ఏప్రిల్ 13న PCR ఫలితాలు వచ్చాయి. అందులో అన్ని శాంపిల్స్ ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ పాజిటివ్‌గా (ASF) ఉన్నట్లు నిర్ధారించారు. చాలా పందులకు ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నాయని పరిశోధక బృందం గుర్తించింది. అయితే.. ఆఫ్రికన్ స్పైన్ ఫ్లూ పూర్తి నిర్ధారణకు సంబంధించి మరో రిపోర్టు రావాల్సి ఉందని పశుసంవర్ధక శాఖ డిసీజ్ టెస్టింగ్ లాబొరేటరీ అధికారులు తెలిపారు. భోపాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిసీజ్ డయాగ్నోస్టిక్స్ నుంచి రిపోర్టు రావాల్సి ఉందని తెలిపారు.
కాగా.. త్రిపురలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ అలజడి నేపథ్యంలో ఫ్లూ నియంత్రణకు పందులను వధించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. కాగా.. చంపిన పందులను 8 అడుగుల లోతైన గుంతలో పాతిపెట్టనున్నారు. మిజోరాం తర్వాత త్రిపురలో ఈ కేసులు వెలుగులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు.
Also Read: