సినీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యపై బాలీవుడ్ సెలబ్రిటీలు తలో రకంగా స్పందిస్తున్నారు. ఆయన సూసైడ్ అత్యంత బాధాకరమని అంటూనే.. మంచి భవిష్యత్తు ఉన్న నటుడు ఇలాంటి దారుణానికి పాల్పడి ఉండరాదంటూనే… కొందరు.. పరోక్షంగా సుశాంత్ వైఫల్యాలను ప్రస్తావిస్తున్నారు. నిన్నటికి నిన్న కంగనా రనౌత్.. ఓ సుదీర్ఘమైన పోస్ట్ పెడుతూ.. సుశాంత్ చాలా మంచి నటుడని, అయితే తన చిత్రాలను చూడాలంటూ అనేకమందిని ప్రాధేయపడ్డాడని, ఆ సినిమాల విజయవంతానికి తోడ్పడాలని బతిమాలాడని పేర్కొంది. బాలీవుడ్ లో కొన్ని చీకటి కోణాలు ఉన్నాయంటూ.. కొందరు సినీ జర్నలిస్టులు కూడా సుశాంత్ ని అప్రదిష్ట పాల్జేయడానికి, ఆయన కెరీర్ ఎదగకుండా చూడాలని ప్రయత్నించారని కూడా ఆమె ఆరోపించింది.
అయితే సీనియర్ నటుడు మనోజ్ బాజ్ పాయ్.. ఆమె పేరు చెప్పకుండానేఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ.. సుశాంత్ తన చివరి రోజుల్లో కూడా ఎవరినీ ప్రాధేయపడిన దాఖలాలు లేవన్నారు. అంత మంచి నటుడు ఎప్పుడూ,, ఏ సమయంలోనూ దిగాలుగా కనిపించలేదని, తన సినిమాల జయాపజయాలను లైట్ గా తీసుకునేవాడని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఒకరి వైఫల్యాలను పరోక్షంగా గానీ, ప్రత్యక్షంగా గానీ ఎత్తిపొడవడం తగదని మనోజ్ పాజ్ పాయ్ పేర్కొన్నారు. ఈ ఇండస్ట్రీలో ఒకవైపు ముళ్ళు, మరోవైపు పూలు ఉన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. సుశాంత్ ఏ పరిస్థితుల్లో ఇంత దారుణ నిర్ణయానికి వచ్చాడో, అందుకు దారి తీసిన పరిస్థితులేమిటో అందరికీ తెలియవలసిన అవసరం ఉందన్నారు. నిజంగా ఒక ఎదుగుతున్న నటుడు ఒకరిని చెయ్యి చాపే పరిస్థితే ఏర్పడదన్నారు. ఈ బాలీవుడే కాదు.. ఏ హాలీవుడ్ అయినా ఎంతోమంది సీనియర్ నటులు కూడా తరచూ వ్యక్తిగత సమస్యలను ఎదుర్కొంటూనే ఉంటారని ఆయన పేర్కొన్నారు.