ఢిల్లీ ఎన్నికల్లో సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ దూసుకుపోతోంది. మంగళవారం ఓట్ల లెక్కింపు జరుగుతున్న కొద్దీ తొలి నుంచీ ఫలితాలు ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగా వస్తున్నాయి. ఉదయం 11 గంటల సమయానికి ఈ పార్టీ 50 సీట్లలో లీడింగ్ లో ఉండగా.. బీజేపీ 20 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఊసే లేదు. కేజ్రీవాల్ తన సమీప ప్రత్యర్థిపై 7,820 ఓట్ల ఆధిక్యతలో కొనసాగుతున్నారు. ఆయన గెలుపు నల్లేరు మీద నడకే అన్నట్టు కౌంటింగ్ సాగుతోంది. ఆప్ మూడోసారి ఢిల్లీలో అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజాన్ చౌదరి వ్యాఖ్యానించారు. ప్రతివారికీ ఈ విషయం తెలుసునన్నారు. తమ పార్టీ ఓటమి కన్నా బీజేపీపై ఆప్ విజయమే తమకు ముఖ్యమన్నట్టు ఆయన మాట్లాడారు. కాగా.. సీఏఏకి వ్యతిరేకంగా షాహీన్ బాగ్ వద్ద ఆందోళన చేస్తున్న నిరసనకారులు ఆప్ విజయం తమ విజయమే అని పొంగిపోతున్నారు. తమ పట్ల బీజేపీ మంత్రులు, ఆ పార్టీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యల ఫలితమే కమలం పార్టీ ఓటమికి దారి తీస్తున్నాయని వారు పేర్కొంటున్నారు.