Punjab: పంజాబ్ పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి కావల్సినంత సంఖ్యాబలం ఉన్నప్పటికి.. బీజేపీ భయం పట్టుకుంది. పంజాబ్ శాసనసభలో మొత్తం 117 స్థానాలుండగా అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి 92 మంది శాసనసభ్యులుండగా, కాంగ్రెస్ కి 18, శిరోమణి అకాలీదల్ కు ముగ్గురు శాసనసభ్యుల బలం ఉంది. బీజేపీకి 2, బీఎస్పీకి ఒక ఎమ్మెల్యే ఉండగా, స్వాంతంత్య్ర అభ్యర్థి ఒకరున్నారు. పంజాబ్ లో ప్రభుత్వ ఏర్పాటుకు 59 మంది ఎమ్మెల్యేల బలం ఉంటే చాలు. ఆమ్ ఆద్మీ పార్టీకి సాధారణ బలం కంటే 33 మంది సభ్యులు ఎక్కువుగా ఉన్నారు. అయితే పంజాబ్ లో తమ ప్రభుత్వ బలం నిరూపించుకోవడానికి శాసనసభ సమావేశాలు నిర్వహించాలని పంజాబ్ మంత్రి వర్గం నిర్ణయించింది. అయితే బల నిరూపణ కోసం శాసనసభ సమావేశానికి గవర్నర్ అనుమతి నిరాకరించారు. దీంతో పంజాబ్ ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ మారింది. ఇప్పటికే ఢిల్లీ గవర్నర్ తీరుపట్ల గుర్రుగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ, పంజాబ్ లోనూ గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ తీరుపై ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. గవర్నర్ ఏకపక్ష నిర్ణయంపై ఆప్ ఎమ్మెల్యేలు కదంతొక్కారు. రాజ్ భవన్ వరకు మార్చ్ చేసి నిరసన తెలిపారు. రాజ్‌భవన్ ముట్టడికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ ఆపరేషన్ లోటస్‌కు గవర్నర్ మద్దతిస్తున్నారంటూ నినాదాలు చేశారు.
గవర్నర్ చర్యపై సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు నిర్ణయించారు సీఎం భగవంత్‌మాన్. ఆప్ చీఫ్ అరవింద కేజ్రీవాల్ సైతం గవర్నర్ చర్యను ఖండించారు. కేబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ ఎలా నిరాకరిస్తారని నిలదీశారు. ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ యత్నిస్తున్నట్లు గతంలో పంజాబ్ ప్రభుత్వం ఆరోపించింది. ఆపరేషన్ లోటస్‌లో భాగంగా ఆప్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.20 నుంచి రూ.25 కోట్లవరకు ఆశచూపినట్లు ఆరోపించింది. సరైన సమయంలో ఆధారాలను బయటపెడతామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే సర్కారు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు గవర్నర్ అనుమతి కోరింది. ముందుగా అనుమతించిన గవర్నర్.. రెండ్రోజుల్లోనే నిర్ణయం మార్చుకోవడంలో ఆంతర్యమేంటని ప్రశ్నిస్తోంది పంజాబ్ సర్కారు. అసెంబ్లీ సాక్షిగా బీజేపీ కుట్రలు బయటపడతాయనే సమావేశాలకు నిరాకరించినట్లు ఆరోపిస్తున్నారు ఆప్ నేతలు.
మరోవైపు గతంలో ఢిల్లీ శాసనసభలో కూడా తమకు అవసరమైన మెజార్టీ ఉన్నప్పటికి బీజేపీ తమ సభ్యులను ప్రలోభపెడుతుందనే ఆరోపణలతో బలం నిరూపించుకుంది. ఇప్పుడు పంజాబ్ లో కూడా బలం నిరూపించుకోవల్సిన అత్యవసర పరిస్థితులు ఏమి లేకపోయినా.. ఉన్నట్లుండి మెజార్టీ నిరూపించుకోవాలని నిర్ణయించడంతో ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీ భయం పట్టుకుందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు బలం నిరూపించుకుంటే మరో 6 నెలల పాటు ప్రశాంతంగా ప్రభుత్వాన్ని నడపవచ్చనేది పంజాబ్ ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ వైపు పొలిటికల్ అటెన్షన్ ను తిప్పుకోవడానికి అరవింద్ కేజ్రీవాల్ ఓ ప్లాన్ ప్రకారం ఇలా చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..