
ఏడాది ముగింపు దశకు చేరుకుంది. దీంతో చాలా మంది హాలీడే ట్రిప్స్‌ను ప్లాన్ చేస్తున్నారు. క్రిస్మస్ సెలవులు కూడా కలసిరావడంతో హాలీడేలను సరదాగా గడపాలనుకుంటున్నారు. దీంతో హోటల్స్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేస్తున్నారు. అయితే ఇలాగే ఆన్‌లైన్‌లో హోటల్ బుక్ చేసుకుందామని ప్రయత్నించిన ఓ మహిళ ఏకంగా రూ. 3 లక్షలు కోల్పోయింది. ఇంతకీ ఏం జరగిందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
మహారాష్ట్రలోని వాఘోలికి చెందిన ఓ మహిళ క్రిస్మస్ సెలవుల కోసం హాలీడే ట్రిప్‌ని ప్లాన్ చేసింది. ఇందులో భాగంగానే ఆన్‌లైన్‌లో హోటల్‌ను బుక్ చేసుకోవాలనుకుంది. ఈ క్రమంలోనే ఓ హోటల్‌లో రూమ్‌ను బుక్ చేసుకోవాలని ప్రయత్నించింది. కొన్ని క్షణాలకే ఆమెకు ఓ ఫోన్ వచ్చింది. తాను సదరు హోటల్ స్టాఫ్ అని పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి, రూమ్ బుకింగ్కు సంబంధించి సమస్య తలెత్తినట్లు, పరిష్కరించాల్సిన అవసరం ఉందని మాటల్లో పెట్టాడు.
అంతలోనే ఆ మహిళను నమ్మించి.. సదరు మహిళ నుంచి ఆమె బ్యాంక్ ఖాతా వివరాలను సేకరించడం ప్రారంభించాడు. అంతలోనే ఫోన్ కట్ అయ్యింది. అంతలోనే ఆమె బ్యాంక్ అకౌంట్ నుంచి రూ. 3 లక్షలు కట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ప్రస్తుతం దేశంలో ఇలాంటి సైబర్ నేరాల భారీగా పెరిగిపోతున్నట్లు సైబర్ క్రైమ్ నిపుణులు చెబుతున్నారు. రకరకాల మార్గాల్లో ప్రజలను మోసం చేస్తూ, ఖాతాల్లోని డబ్బును దోచేస్తున్నారు. అధికారులు, ప్రభుత్వాలు ఎంత అవగాహన కల్పిస్తోన్నా మోసాలు మాత్రం పెరిగిపోతూనే ఉన్నాయి. ఇలాంటి నేరాల బారిన పడకూడదంటే బ్యాంక్ ఖాతా వివరాలను ఎట్టి పరిస్థితుల్లో ఎవరితో పంచుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఓటీపీలను ఎవరితో షేర్ చేసోకూడదని చెబుతున్నారు. ఇక ఫోన్‌లో మాట్లాడుతున్న వ్యక్తి పట్ల ఏమాత్రం అనుమానంగా అనిపించినా వెంటనే కాల్ కట్ చేయడం ఉత్తమమని చెప్పాలి.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..