ఒడిశా రైలు ప్రమాదం జరిగిన అనంతరం సహాయక సిబ్బంది మృతదేహాలను తరలించే పనిలో ఉన్నారు. అయితే తాజాగా ఓ వ్యక్తి చనిపోయాడనుకొని మృతదేహాలు తరలించే లారీలో ఎక్కించడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే పశ్చిమబెంగాల్‌కు చెందిన బిశ్వజిత్ మాలిక్ అనే వ్యక్తి కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాడు. బాలేశ్వర్ ప్రాంతలో రైలు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో బిశ్వజిత్ చేతికి తీవ్ర గాయం కావడంతో ఎటూ కదలలేకపోయాడు. గాయం తీవ్రంగా బాధిస్తున్నప్పటికి రైలు నుంచి బయటపడ్డాడు. ఎవరినైనా సాయం కోసం పిలవాలనుకున్న నోటి నుంచి మాట రాలేదు. అతని కళ్లు మూసుపోయాయి.
కొద్ది సేపటి తర్వాత బిశ్వజిత్‌కు తన జేబులో ఉన్న ఫోన్ మోగుతున్నట్లు అనిపించడంతో లేచాడు. తనకి రెండు వైపుల కొంతమంది అచేతనంగా పడి ఉండటాన్ని చూసి షాకయ్యాడు. తనని కూడా చనిపోయాడనుకుని భావించి మృతదేహాలను తరలించే లారీలో ఎక్కించారని గ్రహించాడు. అక్కడున్న వారికి తాను బతికే ఉన్నాడని తెలిసేలా తన ఎడమచేతిని పైకెత్తాడు. ఇది గమనించిన సహాయక సిబ్బంది.. బిశ్వజిత్‌ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగానే ఉందని.. వైద్యులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..