Calf Naming Ceremony: సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు నామకరణం చేస్తూ వైభవంగా వేడుక జరుపుకుంటారు. కానీ మధ్యప్రదేశ్‌లోని ఖండ్వాకు చెందిన ఓ కుటుంబం తమ ఇంట పుట్టిన లేగదూడకు నామకరణం చేస్తూ పెద్ద వేడుక జరిపారు. మనుషులకు జరిపినట్లే సంప్రదాయంగా అన్ని పద్ధతులు పాటిస్తూ.. వేద పండితుల సమక్షంలో ఆ దూడ జన్మించిన సమయం, నక్షత్రం ప్రకారం “జమున” అని నామకరణం చేశారు. ఈ కార్యక్రమానికి వారి బంధువులే కాకుండా ఖండ్వా ఎమ్మెల్యే సైతం హాజరయ్యారు.
ఖండ్వాలోని కిన్నర్ సమాజానికి చెందిన సీతారాజన్ అనే ట్రాన్స్ ఉమన్ 16 ఏళ్ల క్రితం కైలాష్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. అయితే తనకు సంతానం కలిగే అవకాశం లేదు కనుక, తాము పెంచుకుంటున్న ఆవునే సంతానంగా భావించామని సీతారాజన్ తెలిపారు. ఈ వేడుకకు హాజరైన బంధువులు, కుటుంబ సభ్యులంతా ఎంతో ఆనందంగా నృత్యాలు చేస్తూ కార్యక్రమం నిర్వహించారు.