
దేశవ్యాప్తంగా పిల్లలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు, కౌమార బాలికలలో పోషకాహార లోపాన్ని నివారించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వారి ఆరోగ్య శ్రేయస్సును మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రతి ఏటా సెప్టెంబర్ నెలలో ‘రాష్ట్రీయ పోషణ్ మాహ్’ను నిర్వహిస్తున్నారు. 2018లో ప్రారంభమైన ఈ సామూహిక కార్యక్రమం, 2026 సెప్టెంబర్‌లో “హమారీ అంగన్‌వాడీ, హమారీ జిమ్మెదారి” (మా అంగన్‌వాడీ, మా బాధ్యత) అనే ఆదర్శవంతమైన ఇతివృత్తంతో 9వ ఆవృత్తిలోకి ప్రవేశించింది. ఈ ప్రచారం అంగన్‌వాడీ కేంద్రాలను కేవలం ప్రభుత్వ సేవా కేంద్రాలుగా కాకుండా, సమాజ యాజమాన్యంలో నడిచే పోషణ, ప్రారభ సంరక్షణ కేంద్రాలుగా తీర్చిదిద్దాలని కేంద్రం సంకల్పించింది.
2026 పోషణ్ మాహ్ – 5 ప్రధాన ప్రాధాన్యతలు
ఈ సంవత్సరం రాష్ట్రీయ పోషణ్ మాహ్ ఐదు కీలక అంశాలకు రూపకల్పన చేశారు.
1. ఆహార వైవిధ్యం – ప్రోటీన్ ప్రాముఖ్యత: కుటుంబాల రోజువారీ భోజనంలో తృణధాన్యాలు, చిరుధాన్యాలు (మిల్లెట్స్), పప్పుధాన్యాలు, గింజలు, పాలు, పండ్లు, కూరగాయలను చేర్చడం ద్వారా మొక్కలు, జంతు సంబంధిత వనరుల నుండి లభించే తగినంత ప్రోటీన్ వినియోగాన్ని ప్రోత్సహించడం.
2. తాజా, వేడి వండిన భోజనం (HCM): అంగన్‌వాడీ కేంద్రాలలో స్థానిక చిరుధాన్యాలు, కాలానుగుణ కూరగాయలతో తయారు చేసిన శుభ్రమైన, వేడి భోజనాన్ని పిల్లలకు, తల్లులకు నిరంతరం అందించడం.
3. సామాజిక యాజమాన్యం – జవాబుదారీతనం: అంగన్‌వాడీ నిర్వహణ కమిటీల ద్వారా సమాజ భాగస్వామ్యాన్ని పెంచడం, అలాగే దినచర్య మెనూ బోర్డుల ప్రదర్శన ద్వారా పారదర్శకతను పెంచి సేవల నాణ్యతను పర్యవేక్షించడం.
4. పోషణ – తొలి బాల్య వికాసం (ECCD): బిడ్డ జీవితంలోని మొదటి 1,000 రోజులలో లభించే పోషణ, వారి జ్ఞానాత్మక, శారీరక, భావోద్వేగ వికాసానికి ఏ విధంగా పునాది వేస్తుందో అవగాహన కల్పించడం.
5. PMMVY పదేళ్ల ప్రయాణం: భారతదేశపు ప్రసిద్ధ ప్రసూతి ప్రయోజన కార్యక్రమం ‘ప్రధాన మంత్రి మాతృ వందన యోజన’ (PMMVY) 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని తల్లుల ఆరోగ్యం, పోషణ మరియు ఆర్థిక మద్దతుకు ప్రాధాన్యతనివ్వడం.
బాల రక్షా భారత్ చొరవ మరియు క్షేత్రస్థాయి ప్రభావం
పిల్లల సంక్షేమం కోసం పనిచేసే ‘బాల రక్షా భారత్’ (సేవ్ ది చిల్డ్రన్ ఇండియా) సంస్థ 2004 నుండి ఇప్పటివరకు 26 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో 1.1 కోట్ల మందికి పైగా పిల్లలకు వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా చేరువైంది. ఈ పోషణ్ మాహ్‌లో భాగంగా క్షేత్రస్థాయిలో సంస్థ చేపడుతున్న కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు:
1. శ్రావస్తి (ఉత్తర ప్రదేశ్) జమునాహా బ్లాక్ విజయం
ఉత్తర ప్రదేశ్‌లోని ఆకాంక్షిత బ్లాక్ అయిన జమునాహాను కేంద్ర ఫైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. దీంతో స్థానిక యంత్రాంగం, ICDS, బాల రక్షా భారత్ ఉమ్మడిగా చేపట్టిన చర్యలు అద్భుత ఫలితాలనిచ్చాయి. అంగన్‌వాడీ, ఆశా, ఏఎన్ఎమ్‌లకు ‘పోషణ్ ట్రాకర్’, ‘ఇ-కవచ్’ వంటి డిజిటల్ అప్లికేషన్లపై సమగ్ర శిక్షణ ఇవ్వడం జరిగింది. జూన్ 2023లో 26,179గా ఉన్న పిల్లల పర్యవేక్షణ మే 2024 నాటికి 29,148కి పెరిగింది. తీవ్రమైన పోషకాహార లోపం (SAM) కేసులు 3.09% నుండి 1.20%కి, మధ్యస్థ తీవ్ర లోపం (MAM) కేసులు 7.27% నుండి 2.71%కి గణనీయంగా తగ్గాయి.
2. ఈట్ రైట్ స్కూల్స్ & సేహత్ క్లబ్‌లు
మోండెలెజ్ ఇండియా – FSSAI భాగస్వామ్యంతో పాఠశాల విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించేందుకు ‘ఈట్ రైట్ స్కూల్స్’ ప్రచారాన్ని అమలు చేస్తున్నారు. 246 మంది పాఠశాల వంట మనుషులకు ఆహార భద్రతా శిక్షణ ఇచ్చి, 97 పాఠశాల వంటశాలలను ఆడిట్ చేశారు. ముఖ్యంగా మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడులోని పాఠశాలల్లో 30 న్యూట్రిషన్ గార్డెన్లను ఏర్పాటు చేసి తాజా, సేంద్రియ కూరగాయలను భోజనంలో భాగం చేశారు. అలాగే విద్యార్థులను ఆరోగ్య ప్రతినిధులుగా మారుస్తూ ‘ఆరోగ్య డైరీ’, పజిళ్ళు, గేమ్‌ల ద్వారా ప్రవర్తనా మార్పును (BCC) తీసుకువస్తున్నారు.
3. ముంబై ఎన్-వార్డ్ అర్బన్ స్లమ్ ప్రాజెక్ట్
కె-కార్ప్ ఛారిటబుల్ ఫౌండేషన్‌తో కలిసి ముంబైలోని ఘట్‌కోపర్ (ఎన్-వార్డ్) మురికివాడల్లో రెండేళ్ల లోపు పిల్లల్లో తక్కువ బరువు మరియు క్షీణత (wasting)ను తగ్గించడానికి ఆరోగ్యం, ICDS – WASH (నీరు, పారిశుధ్యం) రంగాలు కలసి బహుళ-రంగాల నమూనాలో పనిచేస్తున్నాయి. లక్షిత ప్రాంతాల్లోని 80% పైగా కుటుంబాలకు సరైన శిశు ఆహార పద్ధతులపై (IYCF) అవగాహన కల్పిస్తున్నారు.
పోషణ అనేది కేవలం ఆహారం అందించడమే కాక, అది సమాజ బాధ్యత, పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది. అంగన్‌వాడీ కేంద్రాలను మరింత సాధికారత వైపు నడిపిస్తూ, అందరం కలిసి సుపోషిత, సమృద్ధ భారత్ నిర్మాణంలో భాగస్వాములవుదాం..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..