వందేమాతరం థీమ్‌.. కళ్లు చెదిరేలా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.. పూర్తి వివరాలివే..

77వ రిపబ్లిక్‌ డే ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. వందేమాతరం మెయిన్‌ థీమ్‌గా శకటాల ప్రదర్శన సాగనుంది. స్వాతంత్ర్య పోరాటం నుంచి ఆత్మ నిర్భర్‌ భారత్‌ దాకా, భారత్‌ వేసిన అడుగులు, ఇప్పుడు విశ్వగురువుగా ఎదుగుతున్న గుర్తులను కళ్లకు కట్టనున్నాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన శకటాలు.. దేశం సాధించిన ఆర్థికాభివృద్ధి, అత్యాధునిక టెక్నాలజీని ప్రదర్శించనున్నాయి. వికసిత్‌ భారత్‌ రూపాలను కళాకారులు ఆవిష్కరించనున్నారు.

వందేమాతరం థీమ్‌.. కళ్లు చెదిరేలా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.. పూర్తి వివరాలివే..
77th Republic Day Parade

Updated on: Jan 25, 2026 | 6:14 PM

భారత ప్రభుత్వం 77వ గణతంత్ర దినోత్సవాన్ని (జనవరి 26) న ఘనంగా నిర్వహించేందుకు సిద్దమైంది. వందేమాతరం థీమ్‌తో జరగనున్న వేడుకలకు భారీ ఏర్పాట్లు చేసింది. న్యూఢిల్లీలోని కార్తవ్య పథ్ వేదికగా ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించనున్నారు. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డర్ లేయెన్ ముఖ్య అతిథులుగా హాజరవుతారు. 90 నిమిషాల పాటు జరగనున్న పరెడ్‌లో 6 వేల 50 మంది సైనికులు పాల్గొంటుండటం.. దేశ నలుమూలల నుంచి వేడుకలకు ప్రముఖులు హాజరుకానుండటంతో పటిష్ట భదత్రా ఏర్పాట్లు చేశారు.

ఈ ఏడాది వేడుకల ప్రత్యేకతగా జాతీయ గీతం ‘వందేమాతరం’కు 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా,  భారత సాంస్కృతిక వైభవం, దేశ ప్రగతి, సైనిక శక్తి, ప్రజల భాగస్వామ్యం (జన్ భాగీదారి) ప్రధాన అంశాలుగా పరేడ్ సాగనుంది.

పరేడ్ కార్యక్రమాలు

ఉదయం 10.30 గంటలకు పరేడ్ ప్రారంభమవుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ ముందుగా జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమర వీరులకు నివాళులు అర్పిస్తారు. అనంతరం కార్తవ్య పథ్‌లో గౌరవ వేదిక వద్ద పరేడ్‌ను వీక్షిస్తారు.

రాష్ట్రపతి, యూరోపియన్ అతిథులు సంప్రదాయ బగ్గీలో రాగా, ప్రెసిడెంట్ బాడీగార్డ్ గౌరవ వందనం చేస్తుంది. జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం 105 మి.మీ లైట్ ఫీల్డ్ గన్స్‌తో 21 తుపాకుల గౌరవ వందనం జరుగుతుంది.

సాంస్కృతిక ప్రదర్శనలు

‘వివిధతలో ఏకత’ థీమ్‌తో 100 మంది కళాకారులు సంగీత ప్రదర్శన ఇస్తారు. నాలుగు Mi-17 హెలికాప్టర్లు పూలవర్షం కురిపిస్తాయి.

సైనిక శక్తి ప్రదర్శన

భారత సైన్యం, నౌకాదళం, వైమానిక దళం సంయుక్తంగా తమ అత్యాధునిక శక్తిని ప్రదర్శిస్తాయి. బ్రహ్మోస్, అకాశ్, సూర్యాస్త్ర రాకెట్ వ్యవస్థలు, T-90 భీష్మ, అర్జున్ ట్యాంకులు, రఫేల్, సుఖోయ్-30, మిగ్-29, జాగ్వార్ యుద్ధ విమానాలు, డ్రోన్లు, రోబోటిక్ డాగ్స్ వంటి ఆధునిక యుద్ధ సాంకేతికతలు ప్రదర్శించనున్నారు.

వందేమాతరం థీమ్‌.. స్వాతంత్ర్య సమరం టు ఆత్మనిర్భర్‌ భారత్‌

77వ రిపబ్లిక్‌ డే పరేడ్‌కు.. ఢిల్లీ రాష్ట్రీయ రంగస్థల క్యాంప్‌ దగ్గర పూర్తి స్థాయిలో రిహార్సల్స్‌ పూర్తయ్యాయి. 17 రాష్ట్రాలు, 13 కేంద్ర మంత్రిత్వ శాఖల శకటాలు సమాయత్తమయ్యాయి. 2వేల 500 మంది కళాకారులు, ఈసారి కర్తవ్యపథ్‌ మీద, తమ రాష్ట్రాల సంస్కృతిని ఆటపాటల రూపంలో వినిపించనున్నారు. ఈసారి 90 నిమిషాల పాటు కర్తవ్యపథ్‌లో శకటాల ప్రదర్శన జరగనుంది. 150 ఏళ్లు పూర్తి చేసుకున్న వందేమాతరం గీతమే.. మెయిన్‌ థీమ్‌గా ఈవెంట్‌ సాగనుంది. బంకించంద్ర ఛటర్జీ రాసిన వందేమాతరం గీతం…స్వాతంత్ర్య సంగ్రామంలో.. దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చింది. మర ఫిరంగిలో దట్టించిన మందుగుండు పేలినట్లు.. వందేమాతరం నినాదం దేశమంతా ప్రతిధ్వనించింది. తెల్లవాడి గుండెల్లో గుబులు పుట్టించింది. స్వాతంత్ర్యం కావాలంటూ అఖండ భారతం పెట్టిన పొలికేక.. వందేమాతరం. పశ్చిమ బెంగాల్‌ శకటం.. వందేమాతరం థీమ్‌ను ప్రజల కళ్లకు కట్టనుంది. అయితే ఈసారి రోస్టర్‌ విధానం వల్ల రిపబ్లిక్ డే పరేడ్ లో తెలుగు రాష్ట్రాల శకటాలకు చోటు దక్కలేదు.

ఇక అసోం, బిహార్‌, ఈశాన్య రాష్ట్రాల శకటాలు.. మధ్య భారత రాష్ట్రాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు…తమ తమ శకటాలను ప్రదర్శించనున్నాయి. కర్తవ్యపథ్‌ మీద, శకటాల రూపంలో తమ సంస్కృతి సంప్రదాయాల సంతకం చేయనున్నాయి.

శాస్త్ర సాంకేతిక సామాజిక న్యాయ ఆర్థిక రంగాల్లో వికసించిన భారతాన్ని శకటాల రూపంలో ప్రదర్శించనున్నారు. 2047నాటికి వికసిత్‌ భారత్‌ ఎలా ఉంటుందో, ఈ ప్రదర్శనల ద్వారా కళ్లకు కట్టనున్నారు.

భారతీయ న్యాయ సంహిత శకటం ఈసారి ప్రత్యేక ఆకర్షణగా ఉండనుంది. అలాగే గాంధీజీ పుట్టిన గుజరాత్‌లో స్వాతంత్ర్య సంగ్రామం ఎలా జరిగిందో శకటాల రూపంలో వివరిస్తారు.

ఇక ఆపరేషన్‌ సింధూర్‌ తర్వాత జరుగుతున్న తొలి రిపబ్లిక్ డే పరేడ్‌ కావడంతో, భారత సైనిక పాటవాన్ని, ఆయుధ సంపత్తిని ప్రపంచానికి చూపించనున్నాయి మన రక్షణ బలగాలు.

29 యుద్ధ విమానాల ఫ్లై పాస్ట్‌తో పరేడ్ ముగుస్తుంది. జాతీయ గీతంతో పాటు ‘వందేమాతరం’ బ్యానర్‌తో బెలూన్లు గాల్లోకి విడుదల చేస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..